26-01-2026 12:02:48 AM
భద్రాచలం, జనవరి 25, (విజయక్రాంతి) : భద్రాద్రిలో ఆదివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజ ల అనంతరం సీతా లక్ష్మణ సమేతులైన రామయ్యకు సూర్యప్రభ వాహనంపై మేళ తాళాలు, భక్తుల కోలాటాల నడుమ ఘనంగా తిరువీధి సేవ నిర్వహించారు.
ముందుగా ఈరోజు తెల్లవారుజామున నా లుగు గంటలకు ప్రధాన ఆలయంలో మూ లమూర్తులకు సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగాధి కార్యక్రమాల అనంతరం సూర్యోదయ సమయానికి స్వామివారు సీతాలక్ష్మణ సమితుడై గోశాల వద్దకు చేరుకొని సూర్యప్రభ వాహనంపై సూర్యుడికి అభిముఖంగా ఉన్న స్వామివారి సన్నిధిలో సామూహిక ఉదయాదిత్య పారాయణం అనంతరం స్వామివార్లకు హారతి నివేదన చేసిన అర్చకులు, సీతారామచంద్ర స్వామివారికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఉత్సవ మూర్తులు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు,బంగారు పుష్పాలతో పుష్పార్చన కూడా నిర్వహించారు. రథసప్తమి ఆదివారం నాడు రావడంతో సూర్యవంశంకుడైన రామయ్యను సూర్యప్రభ వాహనంపై దర్శించి తరించేందుకు అశేష భక్తజనం తరలివచ్చారు. ఎంతో నైనానందకరంగా సాగిన స్వామివార్ల సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న భక్తుల జయ జయ ద్వానాల నడుమ మాడ వీధులు మారుమ్రోగాయి..