26-01-2026 01:38:57 AM
కుమ్రం ఆసిఫాబాద్, జనవరి ౨౫ (విజయక్రాంతి): వసంత పంచమి, రథసప్తమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డున గల బాలేశ్వర స్వామి ఆల యంలో రథోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య అంబరాన్నంటేలా సాగాయి. ఉదయం నుంచే అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హో మం కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఆలయం ఎదుటి రహదారి నుంచి ఉత్తర వాహిని నది తీరం వరకు తీసుకువెళ్లే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్లు రథోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పూజల అనంతరం ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి బాలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రం తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తాళ్లతో రథా న్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.
రథోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో నిర్వహించిన జాతరకు జిల్లా కేంద్రం తో పాటు వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు అన్ని చౌరస్తాలలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయం వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
అలాగే గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్య లో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ పాల్గొన్నారు.