26-07-2025 12:55:23 AM
పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూలై 25(విజయ క్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని బి ఎల్‌ఎన్ గార్డెన్ లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 10 వేల 017 కొత్త తెల్ల రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు మార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇక, కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని తెలిపారు. రేషన్ కార్డుల స్థితిని పౌరసరఫరాల శాఖ వ్బుసైట్లో తెలుసుకోవచ్చని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగక పోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులు పంపిణీని ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు.. దాదాపు 15 రోజుల పాటు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. రేషన్ కార్డులు లేక పథకాలకు దూరంగా ఉన్న వారికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనాలు దక్కనున్నాయని, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్డీఓ మధు సుధన్, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.