calender_icon.png 25 July, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొయిటిస్ విస్తరణ

11-08-2024 06:39:14 AM

ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు

  1. 30 ఏఐ కంపెనీల ఆసక్తి
  2. 4 వేల మందికి ఉపాధి
  3. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో వచ్చే నెలలోనే సేవలు
  4. టీ డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తాలకు  సీఎం రేవంత్ ప్రశంస

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ హైదరాబాద్‌లో తమ కేపబిలిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయిం చింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటిం చింది. దీంతో వందలాది మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జొయిటిస్ ఇండియా కేపబిలిటీ సెంటర్‌ను విస్తరించాలన్న కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు.

తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడటంతోపాటు వందలాది మందికి ఉద్యో గాలు లభిస్తాయని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జొయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తీసుకొస్తుందని పేర్కొన్నారు. 

మాకు హైదరాబాదే అనుకూలం

ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జొయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలో అందు బాటులో ఉన్న ప్రపంచస్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జొయిటిస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ చెప్పారు.

జొయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల  శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతోపాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని అన్నారు.

జొయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పనిచేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. వ్యాక్సిన్‌లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోంది. 

    తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ సహకారం

    తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్‌కేర్‌లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది.

    పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతోపాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్‌కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని సీఎం కోరారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు.

    ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ అందించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్టాన్‌ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందని అన్నారు. హెల్త్‌కేర్ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వాలని స్టాన్‌ఫోర్డ్‌ను కోరినట్టు తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.

    స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచస్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్‌కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు. స్టాన్‌ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని పేర్కొన్నారు.