calender_icon.png 6 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం

05-05-2025 02:47:11 AM

నేడు, రేపు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటా

సమ్మె అంటూ సంస్థను కుంగదీయొద్దు

కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

హుస్నాబాద్, మే 4: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలపై ఎప్పుడైనా తనతో నేరుగా మాట్లాడవచ్చని, చర్చలకు ప్రభుత్వం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేడు, రేపు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటానని, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా వచ్చి తమ సమస్యలపై చర్చించవచ్చని ఆహ్వానించారు. ప్రజా పాలనలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. “ఆర్టీసీ మన కుటుంబం. ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి బయటపడుతున్న సంస్థను సమ్మెతో మరింత కుంగదీయవద్దు. మన సంస్థను మనమే కాపాడుకోవాలె” అని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్‌కు ఆకస్మికంగా వెళ్లారు. ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల సమస్యలను కూడా ఓపికగా విన్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ పెద్దగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం, కార్మికులకు బాండ్లు, డీఏలు మంజూరు చేయడం, కారుణ్య నియామకాలు చేపట్టడం వంటి చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

పదేండ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. “గత ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకోలేదు. ఒక్క కొత్త బస్సు కొనలేదు. ఒక్క నియామకం చేపట్టలేదు. సమ్మెల వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోయినా కనీసం స్పందించలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోందని, పాత అప్పులు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

రిటైర్మెంట్ రోజునే కార్మికులకు వారి నిధులు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమయంలో సమ్మెకు వెళ్తే సంస్థ మళ్లీ కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని కోరారు.