04-01-2026 12:58:37 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : కవులు, కళాకారుల సేవలను రాష్ట్రప్రభుత్వం గుర్తిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అం దెశ్రీ సేవలను గుర్తించామని, అందులో భాగంగానే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. తెలంగాణ సమాజం అంటేనే కవులు కళాకారులు అని, వారి కృషి సమ సమాజ నిర్మాణం కోసమేనని తెలిపారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయయే తెలంగాణ గీతాన్ని పెద్ద ఎత్తున వాడు కొని.. రాష్ట్రం వచ్చాక గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ గేయాన్ని, మనిషిని వదిలేసింది. అందె శ్రీ రచించిన గేయం ’ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ’ అనే పాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు ప్రభుత్వం మానవత్వంతో అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి .. ఆయన కుమారుడు దత్త సాయికి ఉన్నత విద్యా శాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించామని తెలిపారు.
25 నవంబర్ 20 25న ఆర్డినెన్స్ 7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని, ఇప్పుడు అసెంబ్లీలో ఆ ఆర్డినెన్స్ అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షణీయం’ అని భట్టి విక్రమార్క అన్నారు. అందెశ్రీ తో పాటు పొడుస్తున్న పొద్దు మీద పాటతో తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున లేపిన గద్దర్ తన జీవితాంతం ఆడి, పాడి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్‌ను గౌరవించుకుని సినిమా ఇండస్ట్రీలో ఇస్తున్న నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డ్‌గా నామకరణం చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో సేవలు అందించిన పాశం యాదగిరి, జయరాజు, గూడ అంజన్న, గోరటి వెంకన్న లాంటి వారిని సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తించాం’ అని భట్టి తెలిపారు.