calender_icon.png 8 January, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన సదస్సు..

06-01-2026 07:34:31 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డీఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సూచనల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు చట్టాలు, పిల్లల హక్కులు, బాలపర్యవేక్షణ, బాల్య వివాహాలు, బాలల హక్కుల రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వం గాలి పటాలకు ఉపయోగించే చైనా మాంజాపై నిషేధం విధించిందని, కాటన్ దారాలు మాత్రమే వాడాలని అన్నారు.

ఈ సదస్సులో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, కుంట శ్రీనివాస్,తవుటు మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడెపు రాజేశం, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు రహదారి భద్రత కార్యాచరణ–2026పై రూపొందించిన వాల్ పోస్టర్లను కోనరావుపేట బస్ స్టాండ్ ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రహదారి భద్రతా నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు రహదారి భద్రతకు సహకరించి ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు.