06-01-2026 07:43:31 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీల్) మేనేజింగ్ డైరెక్టర్ & చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రజా బాట కార్యక్రమాన్ని కరీంనగర్ టౌన్–2 సెక్షన్ పరిధిలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) బి.అశోక్, సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఆపరేషన్) ఎం.రమేశ్ బాబు, కరీంనగర్, డివిజనల్ ఇంజినీర్ (ఆపరేషన్) కరీంనగర్ టౌన్ జె.రాజాం, ఎడిఇ (ఆపరేషన్), టౌన్–2, అలాగే టౌన్–2 ఉప విభాగానికి చెందిన అన్ని అసిస్టెంట్ ఇంజినీర్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మాజీ కార్పొరేటర్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మూడు చోట్ల డీటీఆర్ ఏబీ స్విచ్ మరమ్మతులు, స్ట్రక్చర్ రెక్టిఫికేషన్, కొత్త డీటీర్ ఏర్పాటు, వదులుగా ఉన్న లైన్ల సరిదిద్దడం పనులు అక్కడికక్కడే చేపట్టబడ్డాయి.
వినియోగదారులతో విద్యుత్ భద్రతా జాగ్రత్తలు, ముఖ్యంగా పండుగల సమయంలో గాలిపటాలు ఎగురవేయునప్పుడు పాటించవలసిన భద్రతా చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రజా బాట కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు అయిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం, మెరుగైన విద్యుత్ సరఫరా, భద్రతపై అవగాహన కల్పించడం వంటి అంశాలను ప్రజలకు వివరించడం జరిగింది.