04-01-2026 01:00:57 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని చెప్పారు. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇం కా మూడు విడతలుగా పంపిణీ చేస్తామని స్ప ష్టం చేశారు .
గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడే హామీలు అమలులా కాకుండా ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, 3 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, 52 వేల ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలి పారు.
వచ్చే వర్షకాలంలోగా తొలివిడత మం జూరైన ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పా రు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇండ్లు ఇచ్చేవారని, కానీ, మేము రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పం పిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిలో ౨బీహెచ్‌కే ఇండ్లు మేమే కట్టించామని తెలిపారు.
ఇందిర మ్మ ఇండ్లకు కేటాయించే రూ.5 లక్షల్లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఇస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 400 చదరపు అడుగుల పరిమితికి మించి నిర్మించిన ఇళ్లకూ నిధులు మంజూరు చేస్తామన్నారు.
గతంలో కమిషన్ల కోసమే
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. మేము గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. భేషజాలకు పోకుండా అందరికీ నిధులు ఇస్తున్నామన్నారు.
పల్లెల్లో, పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంలు పూర్తి చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 133 కాలనీల్లో 36 వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని వీటికోసం రూ.744 కోట్లు కేటాయించా మని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.
వచ్చే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం
సింగరేణి ప్రాంతాల్లో 76 జీవో ప్రకారం పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉందని దీనిపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి పట్టాలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించి మొండి గోడలతో వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల ఇండ్లు ఉన్నాయని వీటి విషయంలో కేబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని పెద్ద పట్టణ ప్రాంతంలో స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ సెక్రటరీతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు.