25-12-2025 01:08:10 AM
విజయ్ హజారే ట్రోఫీలో సంచలనాలు
32 బంతుల్లో బిహార్ క్రికెటర్ శతకం
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
బిహార్ రికార్డు స్కోరు...కర్ణాటక రికార్డు ఛేజింగ్
భారత దేశవాళీ క్రికెట్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తొలిరోజే రికార్డులతో మోతెక్కిపోయింది. ఒకవైపు కుర్రాళ్లు.. మరోవైపు స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ సంచలన ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయారు. దాదాపు చాలా మ్యాచ్‌లలో పరుగుల వరద పారింది. ఫలితంగా 32 బంతుల్లోనే బిహార్ క్రికెటర్ రికార్డు సెంచరీ...33 బంతుల్లో ఇ షాన్ కిషన్ శతకం..36 బంతుల్లో వైభవ్ విధ్వంసం... రోకో జోడీ సెంచరీల హోరు... బిహార్ 574 రన్స్‌తో భారీస్కోరు...కర్ణాటక జట్టు రికార్డు ఛేజింగ్.. వెరసి తొలిరోజు విజయ్ హజారే టోర్నీలో అన్నీ రికార్డులే.. అన్నీ విశేషాలే..
డిసెంబర్ 23 (విజయక్రాంతి): స్టార్ ప్లేయర్స్ ఎంట్రీతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన విజయ్ హజారే ట్రోఫీలో మొదటిరోజు కుర్రాళ్లు, సీనియర్లు దంచేశారు. అంచనాలు పెట్టుకున్న వారంతా అదరగొట్టేశారు. తొలిరోజు రికార్డుల మోతలో ముందు చెప్పుకోవాల్సింది బిహార్, అరుణాచల్‌ప్రదేశ్ మ్యాచ్ గురించే.. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చాలా రికార్డుల బద్దలయ్యాయి.
బిహార్ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం,14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రికార్డు స్ట్రుక్‌రేటుతో డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో శతకం బాదిన, 150 ప్లస్ స్కోరు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
ఇటీవల అండర్ 19 ఆసియాకప్ ఫైనల్లో పాక్‌పై నిరాశపరిచినా.. 2 రోజుల వ్యవధిలో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి దుమ్మురేపాడు. కేవలం 84 బంతుల్లోనే 190 రన్స్(16 ఫోర్లు, 15 సిక్సర్లు)తో అదరగొట్టాడు. అయితే వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన రికార్డును అరగంటలోనే అతని సహచర బ్యాటర్ సకీబుల్ గని బ్రేక్ చేశాడు. గని కేవలం 32 బంతుల్లోనే శతకం బాదాడు.లిస్ట్ ఏ క్రికెట్‌లో భారత్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ.
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ రికార్డునే కాదు 2024లో పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ చేసిన 35 బంతుల్లో సెంచరీని కూడా గని దాటేశాడు. అతని కంటే 3 బంతులు తక్కువగానే ఆడి శతకం చేశాడు. గని కేవలం 40 బంతుల్లోనే 128 రన్స్ (12 సిక్సర్లు, 10 ఫోర్లు) చేశాడు. 26 ఏళ్ళ సాకిబుల్ గని బిహార్ జట్టులో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. అయితే తాజా ఇన్నింగ్స్‌తోనే ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.
కాగా వైభవ్, గని వికెట్ కీపర్ లోహరుకా (56 బంతుల్లో 116) సెంచరీతో బిహార్ 50 ఓవర్లలో ఏకంగా 574/6 పరుగులు చేసింది. ప్రొఫెషనల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇంతకుముందు తమిళనాడు 506 పరుగులు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును బిహార్ అధిగమించింది. కాగా అరుణాచల్ ప్రదేశ్ ఛేజింగ్‌లో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది.
ఇషాన్ కిషన్ విధ్వంసం
మరోవైపు జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన సూపర్‌ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వరద పారించి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఇషాన్ కిషన్ తాజాగా విజయ్ హజారేలోనూ దుమ్మురేపాడు. తొలి మ్యాచ్‌లో కర్ణాటకపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ శతకాల మోత మోగించిన ఇషాన్ ఇప్పుడు విజయ్ హజారేలోనూ అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో కుషాగ్రా, విరాట్ సింగ్ కూడా రాణించడంతో ఆ జట్టు 412 పరుగుల భారీస్కోరు చేసింది.
కర్ణాటక రికార్డు ఛేజింగ్
ఇషాన్ విధ్వంసంతో భారీస్కోరు చేసినా జార్ఖండ్ దానిని కాపాడుకోలేకపోయింది. కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వీరోచిత పోరాటంతో రికార్డు స్కోరును ఛేజ్ చేసింది.413 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 147 రన్స్ చేసాడు. పడిక్కల్‌తో పాటు అభినవ్ మనోహర్(56), ధృవ్(40 నాటౌట్) రాణించడంతో కర్ణాటక 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్యఛేదనగా నిలిచింది. అలాగే విజయ్ హజారే టోర్నీ చరిత్రలో రికార్డు ఛేజింగ్‌గా నమోదైంది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆసీస్‌పై సౌతాఫ్రికా ఛేదించిన 435 పరుగులే అగ్రస్థానంలో ఉంది.
స్వస్తిక్ సమల్ డబుల్ సెంచరీ
విజయ్ హజారేలో తొలిరోజు ఒక అనామక ఆటగాడు కూడా చరిత్ర సృష్టించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో రికార్డులకెక్కాడు. ఒడిశా క్రికెటర్ స్వస్టిక్ సమల్ సౌరాష్ట్రపై అదరగొట్టేశాడు. 169 బంతుల్లో 212 (21 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేశాడు. తద్వారా లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఒడిశా క్రికెటర్‌గా ఘనత సాధించాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగానూ నిలిచాడు. ఇటీవల మినీవేలంలో సమల్‌ను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. కాగా అతని విధ్వంసంతో ఒడిశా 345 పరుగుల భారీస్కోరు చేసింది.
రోహిత్, కోహ్లీ తగ్గేదే లే
బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్‌తో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ విజయ్ హజారేలో తొలిరోజే దుమ్మురేపారు. తమ ఫామ్ కంటిన్యూ చేస్తూ అదరగొట్టారు. సుధీర్ఘ కాలం తర్వాత ఈ స్టార్ ప్లేయర్స్ విజయ్ హజారేలో ఆడడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ తమ ఫామ్, ఫిట్‌నెస్ విషయంలో ఉన్న అనుమానాలను మరోసారి పటాపంచలు చేసేసింది.
ముంబై తరపున దాదాపు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న రోహిత్ శర్మ సిక్కింతో మ్యాచ్‌లో కేవలం 61 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీనిలో 80 పరుగులు (8 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీల ద్వారానే వచ్చాయి. రోహిత్‌కు ఇది 37వ లిస్ట్ ఏ క్రికెట్ సెంచరీ. అలాగే తన కెరీర్‌లో ఫాస్టెస్ట్ లిస్ట్ ఏ శతకంగానూ నిలిచింది. రోహిత్ 155 (94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులతో చెలరేగడంతో ముంబై 8 వికెట్ల తేడాతో సిక్కింను ఓడించింది.
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం శతక్కొట్టాడు. 15 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న కోహ్లీ ఆంధ్రాతో మ్యాచ్‌లో 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 రన్స్ చేశాడు. గత ఐదు వన్డే మ్యాచ్‌లలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. కాగా ఈ ఇన్నింగ్స్‌తో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని కోహ్లీ 343 మ్యాచ్‌లలో అందుకున్నాడు. గతంలో సచిన్ మాత్రమే భారత్ తరపున ఈ ఘనత సాధించాడు.