01-11-2025 12:23:45 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 500 గిగావాట్ల ఉత్పత్తిలో 74 శాతం థర్మల్ పవర్ స్టేషన్లలో అవుతోందని పేర్కొన్నారు. 22 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వల కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉన్నాయని, పొలాల్లో సోలార్ పంప్ సెట్లు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం పథకం తీసుకొచ్చిందని తెలిపారు.
రైతులకు కావాల్సిన విద్యుత్‌ను ఇక వారే ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. గృహ అవసరాల కోసం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద సౌర విద్యుత్ అందించే కార్యక్రమం ద్వారా నిర్దేశించిన సమయం కన్నా ముందే లక్ష్యాలను చేరుకున్నామన్నారు.
40 వేల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు
యూరియా వంటి ఫర్టిలైజర్ల ధరలు భారీగా పెరిగినా.. సబ్సిడీ ధరకే రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు 450 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ డీసెంట్రలైజ్డ్ పవర్ గ్రిడ్‌కు అనుమతి ఇచ్చారన్నారు. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను కేటాయించాలని కేంద్ర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. దీనికి స్పందనగా 40 వేల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. 20 వేల యూనిట్లను మొదటి విడతలో ఇన్ స్టాల్ చేస్తామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
రామగుండం ఎన్టీపీసీలో ఉత్పత్తి చేసే విద్యు త్‌లో 80 శాతం పవర్‌ను తెలంగాణకే కేటాయింపులు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కానీ ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేయకుండా మూడో వంతు మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిందని, అందుకే ఎన్టీపీసీ ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
పెట్టుబడులకు నైవేలీ కార్పొరేషన్ సిద్ధం
నైవేలీ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణలో 10వేల కోట్ల మేర పెట్టుబడులతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇందుకు రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి భూమి కేటాయించి సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణానికి ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. రాష్ర్టంలో 9.8 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, 2030 నాటికి 33,773 మెగావాట్ల అవసరం ఉంటుందని తెలిపారు. పవర్ డిస్కంలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, రూ.30 వేల కోట్ల మేర బకాయిలు ప్రభుత్వం ఇవ్వాలని తెలిపారు.
రెండేళ్లుగా మైనారిటీలకు మంత్రిపదవి ఎందుకివ్వలేదు?
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఇప్పుడు ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. అజారుద్దీన్, మైనారిటీలపై ప్రేమ ఉంటే రెండేళ్లుగా ఎందుకు ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు? ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు.