31-12-2025 12:00:00 AM
భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ సంస్కరణలకు కేంద్ర బిందువుగా వస్తూనే ఉన్నది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఉన్నత విద్యా వ్యవస్థ విషయంలో పలు ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది. 2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) ఇందులో ప్రధానమైనది. అయితే 2025లో ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్’ (వీబీఎస్‌ఏ బిల్ 2025) పేరుతో కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ద్వారా పాత, కొత్త విద్యా వ్యవస్థకు మధ్య గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆ మా ర్పులు ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పాత వ్యవస్థలో, యూ నివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) వంటి వేర్వేరు సంస్థలు నియంత్రణ, గుర్తింపు, ప్రమాణాల నిర్ధారణ మొదలైన అనేక విషయా లను చూసుకునేవి. ఇది బహుళ నియంత్రణ వ్యవస్థగా ఉండేది. దీనివల్ల అనేక సంస్థల మధ్య సమన్వయ లోపాలు, ఆలసత్వం సాధారాణంగా కనిపించేవి.
అయితే ఎన్‌ఈపీ వీబీఎస్‌ఏ బిల్ బిల్లుల ప్రవేశం తర్వాత వీటిలో సమూల మార్పులు వచ్చాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెఈసీఐ) అనే ఏకైక నియంత్రక సంస్థను స్థాపించాలని ప్రతిపాదించారు. దీనిని నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఈఆర్‌సీ), నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏసీ), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ (హెచ్‌ఈజీసీ), జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జీఈసీ) పేరుతో నాలుగు విభాగాలుగా విభజించారు. పాత వ్యవస్థలో బహుళ సంస్థల వల్ల సమస్యలు ఉండేవి.. కానీ కొత్త వ్యవస్థలో ఏకీకరణ వల్ల నిర్ణయాలు వేగవంతమయ్యే అవకాశం ఏర్పడింది.
పారదర్శకతకు దారి..
పాత వ్యవస్థలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తి ఉండేది. ఉదాహరణకు, రాష్ర్ట యూనివర్సిటీలు తమ గవర్నర్లు (చాన్సలర్లు) ద్వారా వైస్- చాన్సలర్లను నియమించేవి. కానీ కొత్త బిల్లులో, కేంద్ర ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీల ద్వారా నియామకాలు జరగాలి. ఇది కేంద్రీకరణను పెంచుతుంది. గుర్తింపు (అక్రెడిటే షన్) విషయంలో, పాత వ్యవస్థలో ఎన్‌ఏఏసీ వంటి సంస్థలు గ్రేడింగ్ ఇచ్చేవి, కానీ కొత్త వ్యవస్థలో ఎన్‌ఏసీ ద్వారా బైనరీ అక్రెడిటేషన్ స్థానంలో మెటా-అక్రెడిటేషన్ వం టి కొత్త పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది ప్రమాణాలను ఏకీకృతం చేస్తుంది. పాత వ్యవస్థలో వేర్వేరు కోర్సులకు వేర్వేరు ప్రమాణాలు ఉండేవి.
కానీ ఎన్‌ఈపీ 2020లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, మల్టిపుల్ ఎంట్రీ- ఎగ్జిట్ సిస్టమ్ వంటివి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎక్కువ అనుకూలతను ఇచ్చే అవకాశముంది. అయితే పాత వ్యవస్థలో మాత్రం ఇది రిజిడ్ స్ట్రక్చర్ ఉండేది. అంతేకాదు పాత వ్యవస్థలో యూజీసీ ద్వారా నిధులు కేటాయించబడేవి, కానీ కొత్త వ్యవస్థలో హెఈజీసీ ద్వారా నిధులు వేరుగా కేటాయించడం జరుగుతుంది. దీనితోపాటు ఈ సంస్థలు నియంత్రణ నుంచి వేరు చేయబడ్డాయి. ఇది పారదర్శకతను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ, విమర్శకులు ఇది కేంద్రీకరణకు దారితీస్తుందని అంటున్నారు. పాత వ్యవస్థలో రాష్ట్రాలు ఎక్కువగా పాల్గొనేవి, కానీ కొత్త వ్యవస్థలో కేంద్రం ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది. అందుకు యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ నియామకాలు ఉదా హరణగా చెప్పొచ్చు.
ఉపాధి అవకాశాలు..
కొత్త సంస్కరణల వల్ల సానుకూల ప్రభావాలు చాలానే ఉన్నాయి. నియంత్రణ సరళీకరణ వల్ల సమస్యలు తగ్గుము ఖం పట్టడంతో పాటు సంస్థలు ఎక్కువ స్వయంప్రతిపత్తిని పొందగలుగుతాయి. పారదర్శకతలోనూ నాణ్యత పెరుగుతుంది. జవాబుదారీతనం బలపడు తుంది. ప్రమాణాల్లో ఏకీకరణ వల్ల అంతర్జాతీయ గుర్తింపు సులభమవుతుంది. విదేశీ విద్యార్థుల సహకారాలు పెరుగుతాయి. ఎన్‌ఈపీ 2020లో మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్‌మెంట్ వంటివి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉపయోగపడుతాయి.
కానీ, ఈ మార్పుల వల్ల అనేక విమర్శలు, సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే కేంద్రీకరణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ము ఖ్యంగా ఈ సంస్కరణలు రాష్ట్రాల హక్కులపై దాడిగా అభివర్ణిస్తున్నారు. ఉదాహర ణకు, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు యూజీసీ గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉండేది. రాష్టాలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉండేది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించుకొనే స్వేచ్ఛ, అకడమిక్ కోర్సుల నిర్వాహణ విషయంలో ప్రత్యేక స్వేచ్ఛ ఉండేది. కానీ కొత్త సంస్కరణల వల్ల ఇప్పుడు ఉన్నత విద్య అనే విషయం రాష్టాల నుంచి కేంద్రం నియంత్రణలోకి వెళ్లిపోయింది. ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన రాష్ర్ట ప్రభుత్వాల అధికారాలు తగ్గిపోయి కేంద్ర ప్రభుత్వం జోక్యం పెరిగిపోతుంది. ఇది వరకు కేవలం సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో మాత్రమే కేంద్రం జోక్యం ఉండేది. కానీ ఇప్పుడు రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల్లో కూడా కేంద్రం పెత్తనం కొనసాగుతుంది.
రాష్ట్రాలపై ఆర్థిక భారం..
ఎన్‌ఈపీ 2020లో విదేశీ ప్రైవేట్ పెట్టుబడులను (ఇన్వెస్ట్‌మెంట్‌లను) ప్రోత్సహిం చడం వల్ల విద్య అనేది ధనికులకు మాత్ర మే అందుబాటులో ఉంటుంది. ఫీజులు అధికంగా ఉంటాయి. అధిక సంఖ్యలో ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు తీ వ్ర నష్టాలు జరుగుతాయి. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వాలు విద్యార్థులకు స్కాలర్ షిప్పు లు, కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు చేయలేక బకాయిలు పేరుకుపోతున్నాయి. తాజా విధానంతో రాష్ట్రాల మీద ఆర్థిక భారం మరింత పెరిగిపోతుందనే విమర్శలు ఎక్కువైపోయాయి.
ఇది విద్యార్థుల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉం టుంది. కొత్త వ్యవస్థలో ఫ్లెక్సిబుల్ సిస్టమ్ వల్ల డ్రాపౌట్ రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గ్రామీణ విద్యార్థుల్లో డ్రాపౌట్ రేట్స్ పెరిగినట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రైవేట్ కోచింగ్ సంస్కృతి సమస్యను మరింత జఠిలం చేసే అవకాశముంది.
సవాళ్లు అధిగమిస్తేనే..
ఈ సంస్కరణల ద్వారా విద్య విషయంలో లౌకిక, శాస్త్రీయ దృక్పథం తగ్గు తుందనేది ప్రధాన ఆందోళన. 2024లో జేఎన్‌యూలో హిందూ, బౌద్ధ, జైన స్టడీస్ సెంటర్లు స్థాపించడం వంటివి ఇందుకు ఉదాహరణలు. జోతిష్యం, వాస్తు, యోగా మొదలైన కోర్సులు పెరుగుతాయి.ఇది విద్యా స్వేచ్ఛను హరిస్తుందని అకడమిక్ ఫ్రీడమ్ నివేదికలు చెబుతున్నాయి.విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయాలు మిశ్ర మంగా ఉన్నాయి. కొందరు ఎన్‌ఈపీ 2020ను స్వాగతిస్తూనే ఇది నైపుణ్యాల గ్యాప్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు.
కానీ వామపక్ష విద్యావేత్తలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు, సీపీఐ(ఎం) దీనిని కమర్షియలైజేషన్, కమ్యూ నలైజేషన్‌కు దారితీస్తుందని చెబుతుంది. పరిశోధనా సంస్థలు లెఫ్ట్ -లిబరల్ అకడమిక్స్ ఎన్‌ఈపీను ‘ఎలిటిస్ట్, హిందూ సు ప్రీమసిస్ట్’ అని విమర్శిస్తున్నాయి. మొత్తం గా ఈ సంస్కరణలు సానుకూల మార్పు లు తెచ్చినప్పటికీ, కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతతత్వకరణ వంటి సవాళ్లు పెద్దవిగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాలు, విద్యావేత్తలు, మీడియా ఈ విషయంపై తమ అభిప్రాయాలను సమతుల్యంగా చర్చించి భవిష్యత్తు విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 9849328496
కోలాహలం రామ్ కిశోర్