calender_icon.png 11 November, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 నెలల్లో .. 27 వేల వాహనాలు

19-05-2024 01:49:16 AM

టీఎస్ స్థానంలో టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పరిపాలనా పరమైన నిర్ణయాల్లో పలు విప్లవాత్మక మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవం త్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వాహనాల రిజిస్ట్రేషన్లను టీఎస్ స్థానంలో టీజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ స్టేట్ (టీఎస్) పేరుతో రిజిస్ట్రేషన్ అవు తున్న వాహనాలను ఇకపై తెలంగాణ (టీజీ) పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని మార్చి 12న ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌కు బదులు టీజీ అక్షరాలను రవాణా శాఖ వినియోగిస్తున్నది. 

హైదరాబాద్‌లో 40 లక్షల వాహనాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఏపీ వినియోగించగా.. అనంతరం టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల క్రితం నిర్ణయించింది. ఈ సమయంలోనే వాహనాల నంబరు ప్లేట్ లకు టీఎస్ ఉంచాలా? టీజీ ఉంచాలా? అనే విషయంపై అప్పట్లో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. చివరకు ప్రభుత్వం టీఎస్ పేరునే ఖరారు చేసింది. దీంతో పదేళ్ల పాటు టీఎస్ పేరుతోనే వాహనాల రిజిస్ట్రేషన్ కొనసాగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్(నార్త్), మలక్‌పేట (ఈస్ట్), చాంద్రాయణగుట్ట (సౌత్), టోలీచౌకి (వెస్ట్), ఖైరతాబాద్ (సెంట్రల్) జోన్లలోని రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో టూ వీలర్లు, ఫోర్ వీలర్లతో పాటు ఇతర అన్ని రకాల వాహనాలు కలిపి దాదాపు 40 లక్షలకు పైగా ఉన్నాయి. 

ఆర్టీవో కార్యాలయాల్లో..

2023లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ బదులు టీజీకి మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ వాది తమ వాహనాలపై ఏపీకి బదులుగా టీజీ అనే అక్షరాలను స్టిక్కర్ వేసుకున్నారంటూ ప్రభుత్వం పలు సందర్భాల్లో గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే టీఎస్ స్థానంలో టీజీ అక్షరాలు ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయాల్లో 27,127 వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సి.రమేష్ తెలిపారు. వీటి లో సికింద్రాబాద్‌లో 4800, మలక్‌పేటలో 3520, చాంద్రాయణ గుట్ట లో 5300, టోలీచౌకిలో 4730, ఖైరతాబాద్‌లో 8777 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆయన వెల్లడించారు.