23-08-2024 12:00:00 AM
బీజేపీ అధికారంలో ఉన్న అసోం ప్రభుత్వం ముస్లిం వివాహాలు, విడాకుల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు కీలకచట్టాన్ని తీసుకు వచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన కొత్త బిల్లుకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా, గురువారంనుంచి ప్రారంభమయిన శాసన సభ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంతకు ముందున్న బ్రిటీష్ కాలం నాటి ముస్లిం వివాహాల చట్టాన్ని రద్దు చేస్తూ గత నెలలోనే రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసింది. ప్రధానంగా ముస్లింలలో బాల్య వివాహాలను కట్టడి చేయడమే కొత్త బిల్లు ముఖ్య ఉద్దేశమని బుధవారం బిల్లును మంత్రివర్గం ఆమోదించడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ తెలిపారు.
కొత్త బిల్లు ప్రకారం ఇకపై ముస్లింల వివాహాలు, విడాకులు అన్నిటినీ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందున్న చట్ట ప్రకారం కాజీలు వివాహాలు రిజిస్టర్ చేసేవారు. అయితే ఇప్పుడు కాజీల పాత్ర వివాహం నిర్వహించడానికి మాత్రమే పరిమితమవుతుంది. ముస్లింల వివాహ సంప్రదాయాల్లో బిల్లు జోక్యం చేసుకోదు. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 18 ఏళ్ల లోపు వ్యక్తుల వివాహాలను చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారు. ఒక వేళ 18 లోపు యువతులు, 21 ఏళ్ల లోపు యువకులు వివాహం చేసుకున్నా వారి వివాహాన్ని ప్రభుత్వ అధికారులు రిజిస్టర్ చేయరు.ఆ వివాహాన్ని చట్టవిరుద్ధమైనదిగా పరిగణిస్తారు.
అలాగే ముస్లిం భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే కాజీల వద్ద కాకుండా అధికారుల వద్ద దాన్ని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.ఈ బిల్లుతో పాటుగా ‘లవ్ జిహాద్’ను నేరంగా పరిగణించే మరో చట్టాన్ని కూడా ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. లవ్ జిహాద్‌కు పాల్పడినట్లు రుజువయితే నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడానికి కొత్త చట్టంలో వీలుంటుంది. వేర్వేరు మతాలకు సంబంధించిన వారి మధ్య భూమి బదలాయింపులను అడ్డుకునే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకు వస్తు న్నట్లు సీఎం చెప్పారు.
బ్రిటీష్ కాలం నాటి పాత చట్ట ప్రకారం వివాహాల రిజిస్ట్రేషన్ రికార్డులు కాజీల వద్ద ఉండేవి. అయితే కొత్త చట్టప్రకారం జిల్లా కమిషనర్లు, రిజిస్టార్ల వద్ద ఉంటాయి. అసోంలో బాల్య వివాహాలు ముఖ్యంగా ముస్లింలలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికల్లా రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. అయితే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే దిశగా ఇదో ముందడుగని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలోకి అక్రమంగా వలస వచ్చిన వారు స్థానిక యువతులను అనధికారికంగా వివాహం చేసుకుని వారి ఆస్తులకు యజమానులవుతున్నారని చాలాకాలంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపిస్తున్నారు. వివాహాల్లో కాజీలు ప్రధాన పాత్ర పోషించే వారు. దీన్ని అరికట్టడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశం. ఇందులో మరో మతలబు కూడా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత కొంత కాలంగా తాను చేయాల్సిన పనిని పార్టీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో అమలు చేసి, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు దాన్ని అమలుచేసేలా చూస్తున్న విషయం తెలిసిందే.
గతంలో సీఏఏ చట్టం విషయంలోనూ ఇలాగే చేసింది. వివాదాస్పద అంశాల విషయంలో పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యతిరేకతను తప్పించుకోవడానికి కమలదళం అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహం ఇది. ఇప్పుడు ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ చట్ట విషయంలోనూ అదే చేసింది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఇదే ఆదర్శంగా నిలుస్తుందేమో చూడాలి.