25-12-2025 12:08:23 AM
వేములవాడ,డిసెంబర్ 24,(విజయ క్రాంతి)సర్వమతాల మధ్య సౌహార్దం, సామాజిక శాంతి పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ& ప్రేమ, కరుణ, సోదరభావాన్ని మానవాళికి బోధించిన ఏసుక్రీస్తు సందేశం నేటి సమాజానికి మరింత అవసరమని అన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, సర్వమత సమ్మేళనానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.గత 40 ఏళ్లుగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్న ఆది శ్రీనివాస్, ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ పథకం తో పేదల సొంతింటి కల సాకారం
వేములవాడ, డిసెంబర్ 24,(విజయ క్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న ఇందిరమ్మ పథకాలు పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాయని అన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అవసరమైన ప్రతి దశలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో అనేక కుటుంబాల జీవితాల్లో ఆశ, ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొని, ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.