28-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అత్యంత క్లిష్టమైన అరుదైన కిడ్నీ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, ఓకే కిడ్నీ నుంచి 1,820 రాళ్లను తొలగించినట్లు హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యుడు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలి కడకంచి పరశురాములు ఈ నెల 23న కిడ్నీ నొప్పితో తమ ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు.
ఈ కేసు డూప్లెక్స్ మొయిటీ (ఒకే కిడ్నీలో ద్వంద మూత్రపిండం) కిడ్నీలో 1చ820 రాళ్లు ఉన్నాయని నిర్ధారించుకున్నామని తెలిపారు. ఆ తరువాత మల్టీ ట్రాక్ పిసిఎన్‌ఎల్ అనే పద్ధతిలో ఓకే సిట్టింగులో మొత్తం రాళ్లను తొలగించినట్లు వెల్లడించారు. రోగి తమ వద్దకు రాకముందు హనుమకొండ, హైదరాబాద్ లాంటి నగరాల్లోని అనేక ఆసుపత్రిలో సంప్రదించగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని రెండు నుంచి మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని అయినప్పటికి రాళ్లు మొత్తం తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారని తెలిపారు.
ఇవన్నీ చేసేందుకు రూ.3.5 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో రోగి భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ఆ తర్వాత తమ ఆసుపత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీలో ఉచితంగా కిడ్నీలోని 1,820 రాళ్లను తొలగించినట్లు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రోగిని 72 గంటలలోపు పూర్తి ఆరోగ్యంతో డిస్చార్జ్ చేయగా రోగితో పాటు రోగి బంధువులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.