28-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): “పిల్లలకు గుండె సమస్య ఉందంటే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలినంత పనవుతుంది. ఏం చేయాలో, చికిత్స ఎలా చేయించాలో, అసలు ప్రాణాలు నిలబడతాయో లేదోనన్న ఆందోళన వారిని ఆలోచించనివ్వదు. కానీ.. మీరు అస్సలు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్య ఉందని తెలియగానే కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకురండి.
వాళ్ల అనారోగ్యాన్ని పూర్తిగా నయంచేసి వారిని సంపూర్ణారోగ్యంతో తిరిగి మీ చేతుల్లో పెడతారు. ఇలా గుండె సమస్యలను జయించి పీడియాట్రిక్ వారియర్లుగా నిలిచి, చదువుల్లోను, ఆటపాటల్లో కూడా అద్బుతంగా రాణిస్తున్న ఈ పిల్లలందరినీ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. వీరందరి ప్రాణాలు కాపాడిన వైద్యబృందానికి, కిమ్స్ ఆస్పత్రికి హ్యాట్సాఫ్” అని ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అన్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన ప్రపంచ గుండె దినోత్సవం సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడటంతో పాటు పలువురు పీడియాట్రిక్ వారియర్స్‌ను, వాళ్ల తల్లిదండ్రులను సత్కరించారు. ఈ సందర్భంగా కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్. మదార్కర్ మాట్లాడుతూ, “ప్రతిసారీ గుండెదినోత్సవం అంటే అందరూ పెద్దవాళ్ల గురించే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం మేం పిల్లల గుండె సమస్యల గురించి చర్చించాలని ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం.
పిల్లలకు ఏవైనా గుండె సమస్యలు ఉంటే అవి పుట్టుకతోనే బయటపడతాయి. గుండె సమస్యతో పుడితే పిల్లలు బతికేందుకు చాలా సమస్యలుంటాయి. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చాలామంది పిల్లలు గుండె సమస్యలతో వచ్చారు. వాళ్లకు ఇక్కడ చికిత్సలు లభించాయి” అని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. అనిల్ మాట్లాడుతూ “గత పదేళ్లలో చాలామంది వారియర్స్ ఈ సమస్యలతో పోరాడి విజయవంతంగా ముందుకెళ్లారు.
అందుకే ఈ రోజును పీడియాట్రిక్ కార్డియాక్ వారియర్స్ డేగా మేం జరుపుకొంటున్నాం వెంటిలేటర్, ఎక్మో, హార్ట్ లంగ్ మిషన్ ఇలాంటి వాటి మీద ఉండి, శస్త్రచికిత్సలు చేయించుకుని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని సత్కరిస్తున్నాం” అన్నారు. పీడియాట్రిక్ కార్టియాలజిస్ట్ డా. సుధీప్ వర్మ మాట్లాడుతూ “విషమ పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి, పిల్లలకు నయం చేయించడానికి ఎంతో కష్టపడిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు.
కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో మాకు అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ, సదుపాయాలు, వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉండడంతో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి అయినా పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్లు, పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు, ఇంకా చాలామంది ఉన్నారు” అని చెప్పారు.
సరైన సమయానికి తీసుకొస్తే ఎంత ఇబ్బంది అయినా నయం చేయగలం అని ఆస్పత్రికి చెందిన డాక్టర్ గౌతమి, సర్జరీ అయిన తర్వాత ఐసీయూలో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్న పీడియాట్రిక్ కార్డియాక్ ఇన్సెంటివిస్ట్ నాగరాజన్ చెప్పారు.