16-08-2024 01:35:03 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నా రు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ ప్రజల మధ్య ఏనాడు లేరని, అందుకే బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టి కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఎప్పటికీ సచివాలయం లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన లోపాలను తమ ప్రభుత్వం సరిచేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేయడం ఎంతో సాహసోపేతమైన చర్య అన్నారు. కొందరి రైతుల కు సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాలేదని, వాళ్లకూ న్యాయం జరుగతుందని జగ్గా రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న గందరగోళాన్ని రైతులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నోళ్లకు ఇప్పుడు అధికారం పోగానే పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఒక్క సీటు ఇవ్వలేదని, కానీ ఉప ఎన్నిక వస్తుందని మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు మెదక్ ఎంపీ సీటును ఎందుకు గెలిపించుకోలేదు? మూడో స్థానానికే బీఆర్‌ఎస్ పడిపోవడానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోలేదా? పార్టీ మారడం ఇది కొత్తేమి కాదని, బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందుకే ఉపఎన్నిక ప్రస్తావన తీసుకొస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. రైతు రుణమాఫీని జీర్ణించుకోవడం లేదన్నారు.