13-12-2024 02:43:44 AM
* ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో అసంపూర్తి వసతులపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కొన్ని సౌకర్యాలు కల్పించినా, మిగిలినవాటిని పూర్తి చేసి వాటి అమలు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు, ఆహారం తదితరాలను అందజేయ కపోవడాన్ని సవాలు చేస్తూ కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ విచారించింది.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహ మ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాల అమల్లో భాగంగా వసతి సౌకర్యాలను మెరుగుపరచామని, దీనికి సంబంధించిన నివేదిక సమర్పించామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. వసతులకు చెందిన పలు అంశాలపై నివేదికలో ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణలో తీవ్రమైన చలి ఉందని, పిల్లలకు సరైన దుప్ప ట్లు కూడా లేవని చెప్పారు.
పరుపులు, బెడ్‌షీట్లు, కాటన్ బ్లాంకెట్స్, దోమతెరలు, టవళ్లు, బాత్రూంల్లో వాడే సోపు తదితరాలు, మంచినీటి కోసం ఆర్వో ఏర్పాటు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూంల ఏర్పాటు, పౌష్ఠికాహారం, మానసిక శాస్త్రవేత్త, కౌన్సెలర్లను ఏర్పాటు చేయలేదని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదికలో ప్రస్తావించని ఈ అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదిక సమర్పించడానికి ఈ నెల 22 వరకు గడువు మంజూరు చేసింది.