13-12-2024 02:45:39 AM
రైతు ఆత్మహత్యలకు పరిహారం చెల్లించకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు కోర్టుకు హామీ ఇచ్చిన గడువులోగా చెల్లించకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ, జనగామ కలెక్టర్ రిజ్వాన్‌బాష షేక్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాలకు నోటీసులు జారీచేసింది.
పరిహారం చెల్లించాలన్న తమ ఆదేశాల అమలుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రైతు ఆత్మహత్యల కేసుల్లో నాలుగు నెలల్లో పరిహారం చెల్లిస్తామంటూ గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సామాజిక కార్యకర్త కొండలరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్లతో కూడిన బెంచ్ విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. పరిహారం చెల్లింపు ప్రక్రియ మొదలైందని, 4 నెలల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని గత ఏడాది నవంబరులో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆత్మహత్యలపై దాఖలైన పిల్ విచారణను హైకోర్టు మూసివేసిందన్నారు. ఏడాది దాటినా ఇప్పటికీ బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని చెప్పారు.
వాదనలను విన్న ధర్మాసనం కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఈ పిటిషన్ను ఎందుకు స్వీకరించకూడదో వివరణివ్వాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.