02-08-2025 06:20:11 PM
హనుమకొండ (విజయక్రాంతి): మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా పాల ఉత్పత్తి జరగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) అన్నారు. శనివారం హన్మకొండ పట్టణంలో ఉన్న ములుగు రోడ్డు సమీపంలో గల విజయ తెలంగాణ డెయిరీని అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డెయిరీ ప్రధాన కార్యకలాపాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత నియంత్రణ విధానాలు, విస్తరణ ప్రణాళికల గురించి సమగ్రమైన వివరణను అడిగి తెలుసుకున్నారు. దామెర మండలం ల్యాదల్లలో నూతన పాల డైరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నూతన డైరీ టెక్నాలజీకి అనుగుణంగా పాల డైరీ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
పాలకుల సహకారం ద్వారా డెయిరీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. డెయిరీ అభివృద్ధి, రైతుల సంక్షేమం గురించి వివరించారు. డెయిరీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో నుండి పాల సేకరణ ప్రక్రియ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ద్వారా శీతలీకరణ, ప్రక్రియకరణ కేంద్రాలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం లతో పాటు పలు అంశాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డి ఆర్ డి ఓ మేన శ్రీనివాస్, వరంగల్ డి ఆర్ డి ఓ కౌసల్య దేవి, విజయ తెలంగాణ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డా శ్రవణ్ కుమార్ కుమార్, డెయిరీ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి. అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.