calender_icon.png 6 July, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి త్రైమాసికంలో నూరు శాతం బొగ్గు రవాణా సాధించిన సింగరేణి

05-07-2025 07:58:33 PM

హర్షం వ్యక్తం చేసిన సీఎండీ  ఎన్. బలరామ్..

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బొగ్గు రవాణాలో 100 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం లక్ష్యాలను సాధించడంపై సీఎండీ ఎన్.బలరామ్(CMD N. Balaram) తన హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు బొగ్గు రవాణా లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా, 103 శాతంతో కంపెనీ 166 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా, 99 శాతంతో కంపెనీ 159.9 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి సాధించింది. శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్(Singareni Bhavan) నుంచి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ సంస్థ డైరెక్టర్లతో, అన్ని ఏరియాల్లోని జీఎంలతో త్రైమాసిక ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షాకాలంలో కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి కుంటుపడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

జులై నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కోసం రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతీ ఏరియా ప్రగతిపై సంబంధిత ఏరియా జీఎంతో సమీక్షించారు. ఉత్పత్తికి అవరోధంగా ఉన్న అంశాలపైన ఆయన అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్తగూడెంలో అన్ని అనుమతులు మంజూరైన వీకే ఓపెన్ కాస్ట్ గని భూమి పూజ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇల్లందు జేకే కోల్ మైన్, గోలేటి కోల్ మైన్ కు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు సంబంధించి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపై నిశితంగా చర్చించారు.

వినియోగదారులకు ఇస్తామన్న గ్రేడ్ బొగ్గును సరఫరా చేయడానికి ప్రతీ ఏరియాలో సిహెచ్ పి లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే రక్షణకు సంబంధించి ప్రతీ గనిలో రక్షణ ఆడిట్లను నిర్వహించాలని, రక్షణ లోపాలు లేకుండా సవరించాలని ఆయన సేఫ్టీ విభాగం వారిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ లో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తిపై కూడా ఆయన సమీక్షించారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని చండిపడా రైల్వే సైడింగ్ కు రవాణా చేయడానికి తగు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు డి. సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం),  ఎల్.వి సూర్యనారాయణ (ఆపరేషన్స్ ), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్),  గౌతమ్ పొట్రు (పా),  ఈడీ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం సుభాని, అడ్వైజర్ (ఫారెస్ట్రీ)  మోహన్ పరిగెన్, జీఎం (సి పి పి) శ్రీ ఏ.మనోహర్, కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.