calender_icon.png 7 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారాజ్యం యువతకు అండగా ఉంటుంది

07-11-2025 05:25:00 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రజా రాజ్యం పార్టీ యువతకు అండగా ఉంటుంది అని తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవి కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణoలోని ప్రెస్ క్లబ్ లో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి రాజకీయ చైతన్య రథయాత్రలు,మేధావులు,ఉన్నత విద్యావంతులు, సంఘ సేవకులు, యువత ప్రజారాజ్యం పార్టీలో చేరెందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందని వివరించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అలాగే గత పది ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అభివృద్ధిని విస్మరించి, అవినీతి అక్రమాలను పెంచి పోషించారన్నారు.

ఇక బిజెపి మతాలను రెచ్చగొడుతూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ప్రజా రాజ్యం పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత నేడు రాజకీయాలను చూసి భయపడుతున్నారని, అసహ్యంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవాభావం కలిగిన యువత ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర స్టార్ క్యాంపెనర్, విశ్రాంత ఐఏఎస్  కూనపు రెడ్డి హరిప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల పార్టీ ఆశయాలు,సిద్ధాంతాలను మెచ్చి చాలామంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు.

2028 నాటికి పార్టీని బలోపేతం చేసి, అవినీతి లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో చైతన్య రథయాత్ర నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆదరించండి- అవినీతి లేని తెలంగాణను నిర్మించుకోండి అనే నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్తామని ఆయన చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో మహిళ నాయకులు విజయ రెడ్డి, ఉదయ్ సింగ్ లు పాల్గొన్నారు.