07-11-2025 05:22:08 PM
నకిరేకల్,(విజయక్రాంతి): “చెకుముకి సైన్స్ సంబురాలు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశీలనాశక్తి, సృజనాత్మకతను పెంపొందించడానికి, శాస్త్రీయ ధృక్పథాన్ని విస్తరించడానికి దోహదపడతాయి” అని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ జయంతి సందర్భంగా చెకుముకి సైన్స్ సంబురాలు శుక్రవారం నకిరేకల్ డివిజన్ పరిధిలోని చిట్యాల, నార్కెట్పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి, శాలిగౌరారం మండలాల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యా సాగర్ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని నోముల ఉన్నత పాఠశాలలో ప్రారంభించి ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. పాఠశాల స్థాయి పోటీలను పర్యవేక్షించి, నిర్వహణలో సహకరించిన పాఠశాల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులు నవంబర్ 21న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి, డిసెంబర్ 12–14 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.