15-11-2025 12:00:00 AM
ముషీరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా, రాజ్యంగబద్దంగా కల్పించాలని, పార్టీల పరంగా ఎట్టి పరిస్థితుల్లో అంగికరించబోమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రామంతాపూర్ టీవీ టవర్స్ నుండి ఉప్పల్ వైపు బీసీ సం ఘాల నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రెండు రోజులలో ఎన్నికలు జరిపే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితిలో చట్టబద్దంగానే ఎన్నికలు జరపాలన్నారు. జనా భా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని ఆర్. కృష్ణ య్య డిమాండ్ చేశారు.
ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయముకు రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, అదే విధంగా రాజ్యాంగ సవరణకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయన్నారు. దీనికి రాజ్యాంగ బద్దత కల్పించడమే శాశ్వత పరిష్కారమన్నారు. ఈ భారీ ప్రదర్శనలలో పల్లగోర్ల మోడీ రాందేవ్ యాదవ్, నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, సీ. రాజేందర్, పగిళ్ళ సతీష్, నిమ్మల వీరన్న, శివ కుమార్ యాదవ్, అంజి గౌడ్, నరేష్ గౌడ్, గోపి తదితరులు పాల్గొన్నారు.