29-09-2025 01:08:00 AM
ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి): ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్థాని క సంస్థల రిజర్వేషన్‌లు ఎట్టకేలకు తేలాయి. ఆయా కేటగిరీల వారిగా రిజర్వేషన్లు కేటాయించారు. ఇక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైందని భావించిన రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు మళ్ళీ ఉత్కంఠ రేపుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించగా..
జిల్లా కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఈ ప్రక్రియ శనివారం రాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఎన్నికల నోటిఫికేసన్ వెలువడనుందని భావిం చిన రాజకీయ ఆశావాహుల్లో రిజర్వేషన్ల తీరుపై కోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్లీ నిరాశ మిగిలింది. రిజర్వేషన్ లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సిన సంఖ్య ప్రకారం ఆయా స్థానాలను కేటాయించగా..
ప్రభుత్వం అధికారికంగా జీఓ తీసుకురావడంతో బీసీలకు తొలిసారి 42 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మిగితా వర్గాలకు వారికి ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని బట్టి కేటాయించారు. ఇదిలా ఉండగా ఈ పద్ధతిలో రొటేషన్ ప్రక్రియను అనుసరించారు. గతంలో ఓ వర్గానికి రిజర్వేషన్ ఉంటే.. ఇప్పుడు వాటిని ఇతరులకు కేటాయించారు. తొలుత ఆయా కేటగిరీల వారీగా మొత్తం రిజర్వేషన్లు తీసిన తర్వాత వాటిలో 50 శాతం మహిళలకు కల్పించారు. ఇందులో లాటరీ పద్ధతిని అనుసరించారు.
అనుకూలించని వారిలో నిరాశ..!
జిల్లాలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. ఈ క్రతువును అధికారులు ఇది వరకే పూర్తి చేయగా.. శనివారం రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో అధికారికంగా వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 20 జడ్పీటీసీ స్థానాలు, 168 ఎంపీపీ స్థానాలతో పాటు, 473 సర్పంచ్ స్థానాలు, 3870 వార్డు స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. కాగా ఇందులో రొటేషన్ పద్ధతి అనుసరించడం..
గతంలో ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుతం రాకపోవడం కారణంగా అనుకూలించని అనేక మంది ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇది వరకు ఆయా పదవుల్లో ఉండగా.. రిజర్వేషన్ అనుకూలిస్తే మరోసారి పోటీ చేసేందుకు కొందరు.. కొత్తగా బరిలో ఉండాలని భావించి ఇన్నాళ్ల పాటు జనాలతో మమేకమైన వారిలో మరికొందరు రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కాగా ఇది వరకు రిజర్వేషన్ అనుకూలించక స్తబ్ధుగా ఉన్న నాయకులు, ఆశశావహహులకు మాత్రం తాజాగా కలిసిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పట్నుంచే బరిలో ఉండేందుకు అన్నిరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా స్థానిక సంస్థల నిర్వహణకు కీలకమైన అడుగు పడటంతో ఆయా పార్టీలకు చెందిని వారిలో ఉత్సాహం వెల్లువిరిస్తోంది.