calender_icon.png 24 December, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి

24-12-2025 02:29:41 AM

మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

ముషీరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో నివసించే గిరిజనులకు వారి జనాభా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి న్యాయం చేయాలని బంజా రా భారత్ అఖిల్ భారతీయ బంజారా మహాసేవ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధరావత్ రవీంద్రనాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర నాయక్ మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇతర ప్రాంతాల్లో ముంపు వల్ల అనేక కారణాలతో డిస్ ప్లేస్ మెంట్ పునరావాసం కల్పించబడిన గిరిజనులకు వెంటనే న్యాయం చేయా లని అన్నారు.

బ్రిటిష్ పాలకులు బలవంతంగా లాక్కున్న రాయలసీన హిల్స్ న్యూ ఢిల్లీలోని 350 ఎకరాల భూమికి( ప్రస్తుతం రాష్ట్రపతి భవన్, నార్త్, సౌత్ బ్లాక్, రకాబ్ గంజ్ గురుద్వారా, పార్లమెంట్ భవన్, బోట్ క్లబ్, జంతర్ మంతర్, ఇండియా గేట్ ఉన్న ప్రాంతం) బదులుగా బంజారా ఔన్నత్యాన్ని చరిత్రను వారి త్యాగాల జ్ఞాపికగా బంజారా ఎడ్యుకేషన్, కల్చరల్ రీసెర్చ్, ఫోక్లోర్ అండ్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, బంజారా స్తూపాన్ని నెలకొల్పుటకు ఢిల్లీలో గాని, పైన తెలిపిన భూమికి బదులుగా ఢిల్లీ పరిసరాల్లో కనీసం 150 ఎకరాల భూమిని కేటా యించాలన్నారు.

అదే విధంగా బంజారా భాష గోర్బోలి అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా పార్లమెంటుకు పంపిన తీర్మానాన్ని వెంటనే ఆమోదించాలన్నారు. రాష్ట్రంలోని బంజారా తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో బంజారా తాండ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవన్ సముదాయ ప్రాంగణంలో లక్కీ షా బంజారా, మక్కన్ షా లాభనాల 125/ 125 ఫీట్ల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన రోడ్లకు, నేషనల్ హైవే లకు, రైలు మార్గాలకు బంజారా ప్రముఖుల పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ్ నాయకులు హన్మ నాయక్ బోనా నాయక్, రవి నాయక్ రాథోడ్, హనుమంతు నాయక్, భీమా నాయక్, రమావత్, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.