24-12-2025 01:31:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో కీలక ఘట్టం పూర్తయింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారన్న అభియోగంపై సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారిస్తున్న సీఐడీ.. మంగళవారంతో ఆ ప్రక్రియకు ముగింపు పలికింది. ఈ కేసులో మొత్తం 25 మందిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో విచారణ పర్వం ముగిసినట్లయింది. ఇప్పుడు అందరి దృష్టి సీఐడీ సమర్పించబోయే తుది నివేదికపై పడింది.
ఆఖరి రోజు ముగ్గురు
విచారణలో చివరి రోజైన మంగళవారం సినీ నటి మంచు లక్ష్మి, బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి, ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వీరిని అధికారులు వేర్వేరుగా దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. ప్రధానంగా యాప్ నిర్వాహకులతో వారికున్న సంబంధాలపై కూపీ లాగారు.
బెట్టింగ్ యాప్ యాజమాన్యంతో రాతపూర్వక ఒప్పందం చేసుకున్నారా? థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ప్రమోట్ చేశారా? ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ వీడియో లేదా స్టోరీ పోస్ట్ చేసినందుకు ఎంత మొత్తం తీసుకున్నారు? డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చాయా? నగదు రూపంలో తీసుకున్నారా? విదేశాల నుంచి క్రిప్టో లేదా హవాలా రూపంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా? భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిషేధమని, వాటిని ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలియదా? తెలిసీ ఎందుకు ప్రమోట్ చేశారు? వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ఇది పెయిడ్ పార్టనర్ షిప్ అని, ఆర్థికపరమైన రిస్క్ ఉంటుందని డిస్క్లుమర్ ఇచ్చారా? అని అధికారులు ప్రధాన ప్రశ్నలు వేసినట్టు సమా చారం.
కాగా గతంలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ, నటి అమృత చౌదరి విచారణకు హాజరయ్యారు. వీరిలో కొందరు యాప్స్ చట్టవిరుద్ధమని తమకు తెలియదని చెప్పగా, మరికొందరు ఏజెన్సీల ద్వారా ఒప్పందాలు జరిగాయని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. సెలబ్రిటీలను కేవలం సాక్షులుగా పరిగణిస్తారా? లేక నేరంలో సహకరించిన వారిగా పరిగణించి కేసులు నమోదు చేస్తారా? లేదా భారీ జరిమానాలతో సరిపెట్టి, భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.