24-12-2025 01:17:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కొత్త సంవత్సరంలో అధికార కాంగ్రెస్‌లో పదవుల పందెరం జరగనుంది. నానినేటెడ్ పదవుల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావహులకు శుభవార్త వినిపించనుంది. మంత్రి పదవులను ఆశించి భంగపడిన కొందరు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూ ర్తయింది. మొదటి విడతలో ఒకేసారి 26 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా ఐదారుగురికి నామినేటెడ్ పోస్టులు అప్పగించినా.. 30 నుంచి 40 కార్పొరేషన్లతో పాటు వందల సంఖ్యలో డైరెక్టర్ పోస్టులు ఇంకా భర్తీ చే యాల్సి ఉంది.
పోస్టుల భర్తీపై ఆలస్యం చేయొద్దని..
సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ లభించింది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఈ లోగానే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. పోస్టుల భర్తీకి పార్టీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆలస్యం చేయొద్దనే నిర్ణయానికి వచ్చారు.
మంత్రులు, ఆ యా జిల్లాల నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆశావహుల పేర్ల జాబితాను కూడా అందజేసినట్లుగా తెలిసిం ది. అయితే, ఈ నామినేటెడ్ పోస్టులకు వం దలాది మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. నిత్యం మంత్రులు, ఇతర సీనియర్ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి దండాలు పెట్టుకుని.. హాజరు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధాన కార్పొరేషన్లు ఎమ్మెల్యేలకే..?
నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానంగా ఆర్టీసీ కార్పొరేషన్, బ్రెవరేజెస్, మూసీ అభివృద్ధితో పాటు మెట్రో రైలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వీటి బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచా రం. ప్రధానంగా మంత్రి పదవులు ఆశించి.. భంగపడిన ఎమ్మెల్యేలకు ప్రధానమైన కా ర్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించి సంతృప్తి పర్చాలని కసరత్తు చేస్తున్నారు.
రెండో విడత మంత్రివర్గ వి స్తరణకు ముందే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు, ఆదిలాబాద్ జిల్లా మంచి ర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా క్యాబినెట్ హోదాతో కూడిన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులను ఆశించారు. సుదర్శన్‌రెడ్డి ఇప్పటికే బాధ్యతలు చేపట్టినప్పటికి.. ప్రేమ్‌సాగర్‌రావు మాత్రం ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.
మూసీ అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి ఒక సీనియర్ ఎమ్మెల్యేకు క్యాబినెట్ హోదాతో ఆర్టీసీ కార్పొరేషన్ అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. మెట్రోరైల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుండంతో.. దానిని కార్పొరేషన్ ఏర్పాటు చేయలనే నిర్ణయానికి వచ్చింది.
కులాల వారీగా కార్పొరేషన్లు..
వీటితో పాటు గొర్రెలు కా ర్పొరేషన్‌తోపాటు కులాల వారీగా కా ర్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ప్రభు త్వం బాధ్యులను నియమించనుంది. ఎస్సీ కులాల్లో మాదిగ, మాలతో పా టు ఉప కులాలను కలిపి మూడు కా ర్పొరేషన్లు, ఎస్టీల్లోని ఆదివాసీ, లంబాడాలతో ఇతరులకు వేర్వేరుగా కార్పొరే షన్లు, బీసీల్లోని గౌడ, పద్మశాలి, యాద వ, మున్నురూ కాపు, రజక, శాలివాహన, వడ్డెర తదితర కులాలకు కార్పొరే షన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్నది.
ఇప్పుడు వీటిలో కొన్నింటికి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి పార్టీ నాయకులను నామినేటెడ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే తొలి విడతలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నం చి పని చేసిన వారికి కాకుండా.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీతో సంబంధం లేని వారికి కూడా పదవులు వచ్చాయనే అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించాలని పలువురు ఆశావహులు విజ్ఞప్తి చేస్తున్నారు.