24-12-2025 01:58:51 AM
అవే సమస్యలు.. అవే కష్టాలు
* భూ రికార్డుల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే.. ఇక ఆ భూ యజమాని తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సర్వే నెంబర్లలో తప్పులు, పేర్లలో తప్పులు, భూ విస్తీర్ణంలో తప్పులు లాంటివి భూ యజమానులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ తప్పులను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించే అధికారాలు స్థానిక రెవెన్యూ అధికారులకు లేకపోవడంతో భూయజమానులు ఆర్డీవో, ఆపై అధికారుల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి. ఇక ప్రొహిబిషన్ భూముల విషయంలో తప్పు దొర్లితే.. నెలల తరబడి తిరగాల్సిందే. ఈ సమస్యలన్నింటినీ గమనిస్తున్న భూయజమానులు ‘వామ్మో.. భూభారతి’ అనే పరిస్థితి దాపురించింది.
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : భూ భారతిలో భూ రికార్డుల నిర్వహణ తప్పుల తడకగా ఉం దని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. రికార్డుల్లో ఏ చిన్న తప్పు దొర్లినా సవరించుకునేందుకు ఉన్నతాధికారుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో.. క్షేత్రస్థాయి సిబ్బందితోనే.. భూములకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా.. దాని స్థాయిని బట్టి క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు (ఎమ్మార్వో), ఆర్డీవో, జా యింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం అయ్యేది.
ఏదైనా తీవ్రమైన సమస్య, లేదా కలెక్టర్ స్థాయి వరకూ డా ఆ సమస్యకు పరిష్కారం దొరక్కపోతేనే సీసీఎల్‌ఏ వర కు వచ్చేది. దానిని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) పరిశీలించి, సంబంధించిన రికా ర్డులు, ఫైళ్లను అధ్యయనం చేసిన తరువాత ఆ సమస్యకు ఒక పరిష్కారం కొనుగొని సమాచారాన్ని ఆ జిల్లా కలెక్టర్ ద్వారా అందించేవారు.
అప్పట్లో భూ సమస్యలను మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలోని అధికారులకు వాటిని పరిష్కరించే అధికారం ఉండేది. వెంటనే సర్వే చేయించి ఆ సమస్యను పరిష్కరించేవారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయి అధికారులకు సమస్యలను పరిష్కరించే అధికారాలు లేకపో వడంతో సామాన్యులకు చుక్కలు కనబడుతున్నాయి.
మొన్నటి వరకు.. ధరణితో..
తెలంగాణ వచ్చిన తరువాత ఏర్పడ్డ బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూముల లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారంగా ‘ధరణి’ని తీసుకొచ్చారు. ధరణిలో భాగంగా సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసి భూముల రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ లాంటివి సామాన్యుల నుంచి జేజేలు అందుకున్నాయి. ఏమైనా తప్పులు దొర్లినప్పుడు వాటిని క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించే అధికారాలు స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి తీసివేసి.. సీసీఎల్‌ఏకు అప్పగించారు.
ఇలాంటి సమస్యల కారణంగా భూయజమానులు సీసీఎల్‌ఏకు పెట్టుకున్న దరకాస్తులు సుమారు 5 లక్షల వరకు పెండింగులో ఉన్నాయి. తమ భూ సమస్యలను పరిష్కరించాలంటూ.. స్థానిక తహసీల్దారు నుంచి మొదలుకుని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్.. సీసీఎల్‌ఏ వరకు చెప్పు అరిగేలా తిరగడం, ఖర్చుల భారం తడిసి మోపెడయ్యింది. దీనితో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
ఇప్పుడు.. భూ భారతితో..
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత.. ధరణిపై ప్రత్యేక దృష్టి సారించి.. పేరును భూభారతిగా మార్చి.. అందులోని లోటుపాట్లను సరిచేశామంటూ గొప్పగా ప్రకటించుకుంది. గతంలో తలెత్తిన ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. అయితే స్థానిక రెవెన్యూ అధికారి అయిన తహసీల్దార్‌కు ఎలాంటి అధికారాలు అప్పగించలేదు. దీనితో పేరులో వచ్చిన తప్పు, సర్వే నెంబర్‌లో తప్పు లాంటివి ఏవి దొర్లినా ఆర్డీవో, ఆపై అధికారుల వద్దకు పరిగెత్తాల్సిందే.
ఇక పీవోబీ (ప్రొహిబిషన్) భూముల విషయంలో తప్పు దొర్లితే.. నెలల తరబడి ఆర్డీవో, కలెక్టర్ చూట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితే నెలకొంది. ఇదే సందర్భంగా.. మధ్య దళారుల దోపిడీకి ఇక్కడే బీజం పడుతుందని, ఉన్నతాధికారుల చుట్టూ తిరగలేక సామాన్యుడు దళారులను ఆశ్రయిస్తున్నారనేది మరో వాదన కూడా ఉంది. దీనికితోడు సరైన శిక్షణ లేని సిబ్బంది, సాంకేతికతలో ఇబ్బందుల కారణంగా.. అనేక తప్పులు దొర్లుతున్నాయి. పట్టా భూములుకూడా నిషేధిత భూముల్లో చేరుతున్నాయి.
నిషేధిత భూములను పట్టాభూములుగా చూపుతున్నారు. దీనితో సామాన్యులు లబోదిబో మంటున్నారు. తమ భూముల సమాచారంలో తప్పొప్పులను సవరించడానికి మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంతో.. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా ఖర్చుల భారం మోయాల్సి వస్తోంది. ప్రజలతో నేరుగా సత్సంబంధాలను కలిగి ఉండే తహసీల్దారు సంతకంతో మాత్రమే ఉత్తర్వులు వస్తాయి.
కానీ అసలు అంతర్గతంగా చేయాల్సిన పని మాత్రం ఆర్డీవో, కలెక్టర్లకు అప్పగించారు. అలా కాకుండా.. స్థానిక అధికారులకు అధికారాలు అప్పగించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే ఈ ఇబ్బందులు తప్పుతాయని, అప్పుడు ధరణికంటే భూభారతి మెరుగ్గా పనిచేస్తుంది ప్రజలు నమ్మే అవకాశం ఉందని రెవెన్యూ నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వ తీరుపై విమర్శలు
భూ రికార్డులు, నిర్వహణలో ఉ న్న సమస్యలను పరిష్కరించేలా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి. ఉ న్న సమస్యలు పక్కనపెడితే.. కొత్త సమస్యలు వచ్చి పడటంతో.. క్షేత్రస్థాయిలో ని భూ యజమానులు మాకెందుకీ భూభారతి అంటూ నెత్తినోరూ కొట్టుకుంటున్నారు.
గతంలో బీఆర్‌ఎస్ విష యంలో ధరణి ప్రభావంతోనే ఎన్నికల్లో ఓడిపోయిన విషయం నుంచి గుణపాఠం నేర్చుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళి తే.. ఈ భూభారతి కూడా కాంగ్రెస్‌ను మింగడం ఖాయమని ఇప్పటినుంచే జోస్యం చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజల భూములపై పూర్తి హక్కులు వారికే ఉండేలాగా చేస్తూ.. అందులో ఏమైనా తప్పులు ఉంటే.. స్థానిక అధికారులకే వాటిని పరిష్కారించే అధికారం ఉండేలా .. కొత్త సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే.