calender_icon.png 24 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు లిఫ్ట్‌పై చిత్తశుద్ధి లేదు!

24-12-2025 01:44:26 AM

  1. బీఆర్‌ఎస్ హయాం సాగునీటికి  చీకటిరోజులు 
  2. వారి హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.1.83 లక్షల కోట్ల ఖర్చు 
  3. ఒక్క ఎకరాకైనా జలాలు పారించడం చేతకాలేదు! 
  4. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన సాగు నీటి రంగానికి చీకటి రోజులని, పాలమూ రు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఆ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగం విధ్వంసానికి గురైందని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఒక్క ఎకరాకైనా నీళ్లివ్వలేదని, పైగాఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరావ్త పాలమూరు ఎత్తిపోతల పనులకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పనులపై మాజీ మంత్రి హరీశ్‌రావు పచ్చిఅబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా 299 టీఎంసీల సాధన కోసం నాటి సీఎం కేసీఆర్ ఏనాడూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. కానీ, కాళేశ్వరం ఎత్తిపోతలకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేశారని, చివరికి మూడు బారజ్‌లు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఉమ్మడి పాలనలో నీటిపారుదల శాఖకు మంచి పేరు ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ శాఖను కమీషన్లశాఖగా మార్చా రని ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టినప్పుడు, వాటిని ఆపాలని కోరుతూ కేంద్రం అపెక్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే, అప్పటి కేసీఆర్ ఆ సమావేశానికి గైర్హాజరయ్యారని గుర్తుచేశారు. 2004 - 14 వరకు 715 టీఎంసీల కృష్ణా జలాలు బేసిన్ దాటి వెళ్తే, బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో ఏకంగా 1442 టీఎంసీల నీళ్లు బేసిన్ దాటి బయటకు వెళ్లిపోయాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ విడుదల కాగానే కమీషన్లు తీసుకునే అలవాటు లేదని హరీశ్‌రావును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు పద్మాలయ స్టూడియో అలవాట్లు తమకు లేవని మంత్రి ఎద్దేవా చేశారు. తమ పదవీ కాలం ముగిసేలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల వాటాను ఆంధ్రాకు అప్పగించిందనే బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.83 లక్షల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఏపీ నీటిదోపిడీకి కేసీఆర్ సహకరించారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశామని గుర్తుచేశారు.