calender_icon.png 24 December, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ దూకుడు.. కేసీఆర్‌కు నోటీసులు?

24-12-2025 01:54:31 AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. అధినేతల వైపు

  1. మాజీ మంత్రులు హరీశ్, కేటీఆర్‌కు కూడా.. 
  2. అసెంబ్లీ సమావేశాల తర్వాతే పరిణామం 
  3. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు సంస్థ 
  4. ప్రభాకర్ రావు వాంగ్మూలంతో బిగుస్తున్న ఉచ్చు 
  5. తెరపైకి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌కుమార్ పేర్లు 
  6. మావోయిస్టులని చెబితేనే సంతకాలు చేశాం : రివ్యూ కమిటీ వివరణ 
  7. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావు సీక్రెట్ చాటింగ్ చిట్టా

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ, అధికార వర్గాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తుది అంకానికి చేరుతోందా? అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అధికారుల అరెస్టు లు, విచారణలతో సాగిన ఈ కేసు దర్యాప్తు.. ఇప్పుడు నేరుగా రాజకీయ అగ్రనేతల గు మ్మం తొక్కబోతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన తొమ్మిది మంది సీనియర్ పోలీస్ ఉన్న తాధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో దూకుడు పెంచుతోంది.

సేకరించిన సాక్ష్యాధారాలు, ప్రధాన నిందితుల వాంగ్మూలాల ఆధారంగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్,  హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం.

ఎవరి ఆదేశాలు అన్నదే కీలకం..

ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తాను సొంతగా నిర్ణయాలు తీసుకోలేదని, ప్రభుత్వం పెద్దల ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకే నడుచుకున్నానని ఆయన పదేపదే చెబుతున్నట్లు తెలుస్తోంది. తన విచారణలో ఆయన అప్పటి డీజీపీ మ హేందర్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అని ల్ కుమార్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించినట్లు సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు.

అయితే, డీజీపీ స్థాయి అధికారి కూడా రాజకీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలనే అమ లు చేస్తారన్న కోణంలో సిట్ లోతుగా దర్యా ప్తు చేస్తోంది. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఎవరికి చేరింది.? దాని వల్ల ఎవరు లబ్ధి పొందారు.? అన్న ప్రశ్నలకు సమాధానంగానే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇవ్వాలని సిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసి న వెంటనే ఈ నోటీసులు వెలువడే అవకాశం ఉంది.

నమ్మించి మోసం చేశారు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన రివ్యూ కమిటీ సభ్యులైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు తిరుపతి, శేషాద్రిలను సిట్ ఇప్పటికే సుదీర్ఘంగా విచారించింది. వీరు సిట్ ముందు తమ నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ప్రభాకర్ రావు ప్రతిసారీ వేల సంఖ్యలో ఫోన్ నెంబర్ల లిస్టును తీసుకొచ్చేవారు. అందులో ఉన్నవి సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులు, ఉగ్రవాదుల నంబర్లని చెప్పేవారు.

ఎస్‌ఐబీ వంటి అత్యున్నత విభాగం మీద ఉన్న నమ్మకంతో, దేశ భద్రత అనే కారణంతో మేం ఆ నంబర్లను వెరిఫై చేయకుండానే అనుమతి ఇచ్చాం’ అని వారు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, జర్నలిస్టుల నంబర్లను ‘దేశ ద్రోహుల’ జాబితాలో కలిపి తమను తప్పుదోవ పట్టించారని వారు వాపోయినట్లు తెలిసింది. మరోవైపు, ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను వెలికితీయడంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కీలక పాత్ర పోషించింది.

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకు, ఈ కేసులో అరెస్టున మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు, డిలీట్ చేసిన డేటాను అధికారులు రీట్రీవ్ చేశారు. ఈ డేటాలో ప్రతిపక్ష నాయకుల కదలికలు, డబ్బుల రవాణా, రాజకీయ వ్యూహాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. మీడియా సంస్థల అధిపతులు, రాజకీయ నాయకులు కలిసి ఒక నెట్వర్క్‌గా ఏర్పడి ట్యాపింగ్ సమాచారాన్ని ఎలా వాడుకున్నారన్న దానికి ఈ డేటా బలమైన సాక్ష్యంగా నిలవనుంది.

రాజకీయ ప్రకంపనలు ఖాయం

సిట్ దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అధికారుల చుట్టూ తిరిగిన కేసు.. ఇప్పుడు రాజకీయ అధినేతల వైపు మళ్లడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.