12-12-2025 09:47:09 PM
మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట,(విజయక్రాంతి): రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నవి అన్ని అమ్మకాలు, అరాచకాలేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చివ్వేంల, పెన్ పహాడ్ మండలాల్లో చందుపట్ల, భక్తలాపురం, చీదేళ్ల గ్రామాలలో రెండో విడత చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
రాబోయే రెండేళ్లు చేస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండ్రన్నారు. కెసిఆర్ ఇచ్చిన పథకాలే సక్కగ ఇవ్వలేక సగం ఎగ్గొట్టారన్నారు. ఐదు విడతల రైతుబందులో ఎంతోమందికి రెండు విడతలే పడ్డాయనీ విమర్శించారు. వడ్లకు బోనస్, తులం బంగారం, మహిళలకు 2500, పెన్షన్ ల పెంపు ఇలా అన్నీ మోసాలే అయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పీకి పందిరేసినట్లేనన్నారు. కెసిఆర్ నిర్మాణాలు చేపట్టి అందరిలో ఆనందం నింపితే.. రేవంత్ కూల్చివేతలతో అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ అంటే కమిషన్లు.. కొట్లాటలేనని, గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. అందుకే గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలాగే అభ్యర్థుల గుర్తులు చేయిస్తూ ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.