27-09-2025 07:43:32 PM
గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసింది
బీసీ రిజర్వేషన్లకు అడ్డు తలిగితే పుట్టగతులు ఉండవు
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి జీవో జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మనోభావాలను గుర్తించిందని బిసి పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్న బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ స్వాగతిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు సగానికి పైగా తగ్గించి నట్టేట ముంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ బీసీల రిజర్వేషన్లపై ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై లెక్కలు తేల్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా, ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపించిన కూడా ఆమోదం తెలపడం లేదని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లపై అడ్డు తగిలితే ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా పుట్టగతులు ఉండవని ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై అడ్డు తగిలినప్పటికీ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయడంపై బీసీలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు.