calender_icon.png 10 May, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌శాఖలో వసూళ్లు కొత్తేమీ కాదట!

09-05-2025 01:10:10 AM

  1. విజయక్రాంతి వరుస కథనాలపై జిల్లాలో జోరుగా చర్చ 
  2. తప్పు చేసిన అధికారులపై స్పందించకపోవడం అంతర్యమేంటి..? 
  3. ములుగు మరమ్మత్ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు

సిద్దిపేట, మే 8 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా విద్యుత్ శాఖలో బినామీ కాంట్రాక్టర్లతో చలామణి అవుతున్న అధికారుల గురించి జోరుగా చర్చ జరుగుతుంది. విజయక్రాంతి ప్రచూరించిన విద్యుత్ శాఖలో ఏం జరుగుతోంది కథనం అధికారులలో ఆలోచనలు రేకెత్తించింది. జిల్లాలోని మరమత్ కేంద్రాలలో ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, బిగింపు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వంటి అంశాలలో జరుగుతున్న అక్రమ వసుళ్లపై విజయ క్రాంతి ప్రచురించిన రెండు కథనాలను సంబంధిత శాఖ అధికారులు అభినందిస్తున్నారు.

అయితే విద్యుత్ శాఖలో అక్రమ వసులు చేయడం కొత్తేమీ కాదంటూ కొందరు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారి బినామీ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని పనులు నిర్వహించడంపై జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వెనక అంతర్యమేంటంటూ సంబంధిత శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై విద్యుత్ శాఖ కార్యాలయాలలో చర్చ జరిగినప్పుడు అక్రమ వసూలు చేసే అధికారులు చర్చలో పాల్గొనకుండా తలదించుకొని వెళ్ళిపోతున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది.

క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పనికి వెలకట్టడం విద్యుత్ శాఖలో కొత్త ఏమీ కాదని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పుడు వారు స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం అంటూ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు వారికి వత్తాసు పలుకుతున్నట్లు స్పష్టం అయిందని శాఖలో బహిరంగగానే చర్చిస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు... 

సిద్దిపేట జిల్లా ములుగు మండలం లోని విద్యుత్ పరికరాల మరమ్మత్ కేంద్రంలో నిల్వ ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై విజయక్రాంతి ప్రచురించిన వార్త కథనంపై అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉండాల్సిన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య కన్నా అదనంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను అక్కడి నుంచి తరలించారు. అవి ఎందుకు, ఎక్కడికి తరలించారనే అంశంపై అధికారులలో స్పష్టమైన వివరణ లేదు.

ఉన్నతాధికారుల సూచన మేరకే ట్రాన్స్ఫార్మర్లను తరలించామంటూ మరమ్మత్ కేంద్రం సిబ్బంది తెలిపారు. వ్యవసాయ బోరు, బావుల వద్దకు ఇవ్వాల్సిన ట్రాన్స్ఫార్మర్లను ఇవ్వకుండా పరిశ్రమలకు కేటాయించామంటూ రైతులను సతాయిస్తూ కార్యాలయం చుట్టూ తింపుకుంటున్న అధికారులపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషయం ఉన్నత అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల పనితీరు పట్ల సర్వత్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.