09-05-2025 12:51:02 AM
పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం
పోటీలతో తెలంగాణ పర్యాటకానికి ప్రపంచగుర్తింపు
పర్యాటక వెబ్‌సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకున్న 5 వేల మందికి వీక్షించే అవకాశం
ఇప్పటికే నగరానికి చేరుకున్న 109దేశాల పోటీదారులు
13న పాతబస్తీ సందర్శన
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక రంగానికి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించడానికి మిస్‌వరల్డ్ పోటీలను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా తెలంగాణ జరూర్ ఆనా (తప్పకుండా తెలంగాణ రండి, పర్యటించండి) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోం ది.
శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండో ర్ స్టేడియంలో మిస్‌వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్‌పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరం గా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యం త్రాంగం కృషి చేస్తోంది. ఏర్పాట్లు అన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి.
ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109దేశాలకు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంతమంది ప్రతి నిధులు వివిధ దేశాల నుంచి రానున్న రెండురోజుల్లో రానున్నారు. వారం రోజులు గా వస్తున్న అతిథులు అందరినీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది.
విదేశీ ప్రతినిధు లు బసచేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసుల భారీ భద్రత కల్పించారు. నేడు, రేపు ఈ కంటెస్టెంట్లు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనబోయే కార్యక్రమాల బ్రీఫింగ్ నిర్వాహకులు చేస్తున్నారు. కంటెస్టెంట్లు విభిన్న కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక, ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు.
సామాజిక అవగాహన సైతం..
బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్‌వరల్డ్ కంటెస్ట్‌లో చేపడుతున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో సహా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశవిదేశాలతో పాటు అన్ని రాష్ట్రా ల ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రచారం కల్పిస్తోంది.
ఇక వివిధ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకు కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్‌సైట్ https: //tourism.telangana.gov.in/events-- రిజిష్టర్ చేసుకున్న వారికి ఐదుకేంద్రాల్లో వేయిమందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్‌వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ చేరుకున్న 109 దేశాల ప్రతినిధులు
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందు కు ఇప్పటివరకు 109 దేశాల పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు దాదాపు అంద రూ పోటీదారులు చేరుకుంటారని నిర్వాహకులు చెప్పారు. మన దేశం నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న మిస్ నందినిగుప్తా, మిస్ అమెరికా అధెన్నా క్రాస్భీ, మిస్ కెనడా ఎ మ్మా మోరిసన్, మిస్ వెనిజులా వాలేరియా కాన్యావో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
ప్రముఖదేశాలతో పాటు మార్టినిక్, గ్యాడలూప్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల ప్రతినిధులు విచ్చేశారు. ఈనెల 31న హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరుగనున్నది. మిస్‌వరల్డ్ పోటీలు వరసగా రెండేళ్ల పాటు మన దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి లభించగా, తెలంగాణ నిర్వహణలో భాగస్వామ్యం కావడం విశ్వవేదికపై మనకు గుర్తింపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
13న చార్మినార్, లాడ్‌బజార్‌ల సందర్శన..
మిస్‌వరల్డ్ పోటీదారులు ఈనెల 13 సాయంత్రం హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్‌బజార్‌లను సందర్శించను న్నారు. సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యా న్ని చారిత్రక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా అక్కడ హెరిటేజ్ వాక్ చేయనున్నారు. లాడ్‌బజార్‌లో మిస్‌వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. చార్మినార్, లాడ్‌బజార్‌లను టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్‌గా ప్రమోట్ చేయనున్నారు.