09-05-2025 01:12:31 AM
సిద్దిపేట జిల్లాలో 13,468 ఎకరాల్లో సాగు
వడగండ్లకు తుడిచిపెట్టుకు పోయిన 1,200 ఎకరాలు
చేజారిన రూ.85 లక్షల ఆదాయం
దిగుబడి లక్ష్యం 40,404 టన్నులు కాత కాసింది 16,161 టన్నులే..
హుస్నాబాద్, మే 7 : మధుర ఫలమైన మామిడి, రైతులకు చేదు ఫలాన్ని ఇచ్చింది. తలెత్తుకునేలా చేస్తుందనుకున్న ఫలరాజు వాళ్ల కుత్తుకలపై అప్పులకత్తిని తెచ్చిపెట్టింది. ఫిబ్రవరి నెలలోనే ప్రతికూల వాతావరణంతో పూత, పిందెలు రాలిపోగా, మిగిలిన కాయలు ఇప్పుడు వడగండ్ల వానతో నేలపాలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 13,468 ఎకరాల్లో మామిడి తోటలు సాగు కాగా, అందులో 1200 ఎకరాలు ఈదురు గాలులు, వడగండ్లతో ధ్వంసమయ్యాయి.
దీంతో అధికారులు పెట్టుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. 40,404 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుందనుకుంటే, 16,161 టన్నులే చేతికొచ్చాయి. రైతులు సుమారు రూ.85లక్షల ఆదాయాన్ని కోల్పోయారు. వచ్చిన కొద్దిపాటి మామిడి కాయలను అమ్ముకుందామంటే మార్కెట్ సౌకర్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, హిమాయత్, అల్ఫన్సా, సువర్ణరేఖ, నీలం, దషేరి, రసాలు వంటి మామిడి రకాలు ఉత్పత్తి అవుతుంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సగటున 43.8 టన్నుల మామిడి దిగుబడికి జిల్లా ఊతంగా నిలుస్తోంది. సాధారణంగా ఏటా మార్చిలో మొదలయ్యే మామిడి సీజన్ జూన్ వరకూ సాగుతుంది. అందులో ఏప్రిల్, మే నెలల్లో మామిడి మార్కెట్ కళకళలాడుతూ ఉండేది. అయితే ఈ సారి పరిస్థితి అలా లేదు. కాసిన కొద్దిపాటి కాయల్లో సగానికిపైగా వడగండ్ల వానతో నేలరాలిపోయాయి.
ఎకరానికి 3.5 టన్నుల మామిడి దిగుబడి అంచనాకు 1.5 టన్నుల పంటే వచ్చింది. కొందరు రైతులు కాయలను చెట్లకే వదిలేశారు. జిల్లా నుంచి కొత్తపేట మార్కెట్ తో పాటు రంగారెడ్డి జిల్లా కోహెడ, వరంగల్, జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్లకు మామిడిని తరలిస్తుంటారు. అక్కడ మార్కెట్లో చాలా వరకూ అమ్ముడుపోగా, మిగిలిన సరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుంది.
ఇప్పటికే కొన్ని రకాలు కోతకొచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఏం చెయ్యలేకపోతున్నామని రైెతులు ఆవేదన చెందుతున్నారు. కొందరి తోటల్లో కాయలు దాదాపుగా పక్వానికి వచ్చి చెట్లకే పండిపోతున్నాయి. ?మామిడి తోటలను గుత్తకు తీసుకున్న సంతోషం సగం పంట వడగండ్లతో నాశనం కావడంతో ఆవిరైంది. ఇప్పుడు కరోనా కారణంగా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాం.
ఎలా గట్టెక్కాలన్నది మాకు అర్థం కావడం లేదు.’ అంటూ హుస్నాబాద్, అక్కన్నపట, కోహెడ మండలాల్లో తోటలను లీజుకు తీసుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్టు వారు చెబుతున్నా కొందరు రైతులు ఇంకా తమకు డబ్బులు ఇవ్వలేదంటున్నారు.
కోల్డ్ స్టోరేజీల ఏర్పాటేదీ?
జిల్లాలో మామిడి రైతులు తమ పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి అనేక ఆటంకాలున్నాయి. మామిడిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన ప్రభుత్వ కోల్డ్ స్టోరేజీలు లేవు. ప్రయివేటు కోల్డ్ స్టోరేజీలు రెండు ఉన్నాయి. ఒకటి సిద్దిపేట, మరొకటి ములుగులో ఉంది. బడా కాంట్రాక్టర్లే వీటిని వినియోగిస్తున్నారు. మామిడి రైతులు, ఎగుమతిదారులు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీలో ఉన్న వేలాది మంది ఆందోళనలో ఉన్నారు.
ఏం జరుగుతోందో తెలియక సతమతం అవుతున్నారు. ప్రభుత్వమే మామిడి దిగుబడిని కొనుగోలు చేసి అమ్మకాలు చేపట్టాలని ఎప్పటి నుంచో రైెతులు డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న కమలాలు, యాపిల్స్ వంటి వాటి కొనుగోళ్లకు ఇక్కడి మార్కెట్లో ఆటంకాలు లేవని, ఇక్కడ పండిస్తున్న మామిడికి మార్కెట్ లేకపోవడం బాధకరమంటున్నారు.
ప్రభుత్వాల ప్రకటనలకు చేతలకు పొంతన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి హరీశ్ రావు బెనిషాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని మామిడికాయలను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నంగునూరులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న తరుణంలో కోల్డ్ స్టోరేజీలు ఉంటే రైతులకు ఇంత నష్టం ఉండపోవని చెబుతున్నారు.
మామిడితో తయారయ్యే ఉత్పత్తులకు బ్రేక్..
మామిడితో పచ్చళ్లు పెద్ద స్థాయిలో తయారుచేస్తూ ఉంటారు. ఏటా ఈ సీజన్‌లో పచ్చళ్లు తయారు చేసి, మిగిలిన కాలమంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు సాగించేవారు అనేకమంది ఈ జిల్లా గడ్డ మీద ఉన్నారు. ఆంధ్రులు పెంపొందించిన ఆవకాయతో అనుబంధం ఉండనే ఉన్నది. మామిడి తాండ్ర పరిశ్రమ కూడా జిల్లాలో అక్కడక్కడా మొదలవుతోంది. ఇక మామిడితో జామ్ వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నాయి.