calender_icon.png 11 September, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో ‘విప్లవం’!

09-09-2025 12:00:00 AM

నేపాల్ రాజకీయ పరిణామాలను చూసినవారెవరైనా భూమి గుండ్రంగానే వుందని ఘంటాపథంగా చెబుతారు. దేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థలు వద్దు.. మాకు రాచరిక పాలనే ముద్దు అని నేపాల్ ప్రజలు చానాళ్లుగా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు తమ డిమాండ్‌తో రోడ్డెక్కారు. వారిని అణచివేసే క్రమంలో పలుసార్లు హింస చెలరేగింది. సోమవారం ఈ నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి.

దేశంలో రాజకీయ పార్టీలు, వాటి నాయకుల తీరుపై విసిగి వేసారిన ప్రజలు, తిరిగి రాచరికాన్నే కోరుకుంటున్నారు. హిందూ దేశంగా నేపాల్‌కు ఒక గుర్తింపు, సుస్థిరత తీసుకువచ్చేందుకు రాచరిక పాలనే సరైన మార్గమని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్న కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం సామాజిక మాధ్యమాలన్నింటిపై నిషేధం విధించింది.

దీనిపై భగ్గుమన్న ప్రజలు, ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను పడదోశారు. పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాలని కూడా ప్రయత్నించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేకమంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సోషల్ మీడియా నిషేధం, దేశంలో పెచ్చుమీరిన అవినీతిపై నిరసన జెండా ఎగరేస్తున్న యువత ‘జనరేషన్ జెడ్’ పేరుతో భగ్గుమన్న ఫలితమిది.

దేశ రాజధాని ఖాట్మండులోనే కాదు.. పోఖారా, బుట్వాల్, ధరణ్, ఘెరాహీ వంటి ప్రధాన నగరాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓలి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపి, హింసాత్మక సంఘటనలను అదుపు చేసేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల అవినీతి, వారి సంతానం విలాస జీవితాలపై వచ్చిన ఫొటోలు, కథనాలు నేపాల్ యువతను ఆగ్రహానికి గురి చేశాయి.

గత ఆగస్టు నుంచి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం గుర్రుగానే ఉంది. సామాజిక మాధ్యమాలపై నేపాల్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఇచ్చినా, ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసిందని యువత భావించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే, ప్రభుత్వం వద్ద నమోదు కాని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించామని, దేశ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని ప్రధాని ఓలి తమ చర్యలను సమర్దించుకొన్నారు.

కొంతకాలంగా  రాజకీయ నాయకుల అవినీతి నేపాల్‌ను కుదిపేస్తున్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిషేధంతో ఒక్కసారిగా ప్రధానాంశంగా మారిపోయింది. గతంలో రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజు బీరేంద్ర కుటుంబంలో జరిగిన ఘటనల్ని కూడా ఇప్పుడు నేపాల్ ప్రజలు క్షమించినట్టుగా కనిపిస్తున్నారు. 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలను గమనించిన ప్రజలు..

రాజకీయ పార్టీలు, నాయకులు తమకు ఎంత దూరంగా ఉంటున్నారనేది దగ్గర్నుంచి గమనించారు. భారత్ పట్ల నూరిపోస్తున్న వ్యతిరేకత, చైనా విధానాలను ప్రజలు పరిశీలిస్తున్నారు. ‘జనరేషన్ జెడ్’ పేరిట నేపాల్‌లో మరో విప్లవంగా రూపుదాలుస్తున్న  ఆందోళన దేశంలో మరొక అధ్యాయానికి నాంది పలుకుతున్నట్టుంది.