14-07-2025 10:36:02 PM
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బీజాపూర్ హైవేపై ధర్నా..
చేవెళ్ల: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రవల్లి శ్రీనివాస్, బేగరి అరుణ్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో బీజాపూర్ హైవేపై ర్యాలీ తీసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరేండ్లుగా స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఉన్నత చదువుల కోసం వెళ్లకుండా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆచరణలో మాత్రం చూపడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వీరి ధర్నా కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకొని.. స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ఎండి. సమీర్ , యశ్వంత్, డివిజన్ సహాయ కార్యదర్శి, నేతలు చరణ్ గౌడ్, మాల చందు, బేగరి తేజ, చిరంజీవి, ప్రశాంత్, ఆకాష్, సోఫియాన్, మోసిన్, అజర్, వంశీ, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.