calender_icon.png 15 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు ప్రక్రియ షురూ..

15-10-2025 04:55:54 PM

ఏర్పాట్లు సిద్ధం చేశాం..

కలెక్టర్ బాదావత్ సంతోష్..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్‌లో 1,62,097 ఎకరాల్లో వరి సాగు జరగగా, 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో వరి కొనుగోలు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. బుధవారం సచివాలయం నుండి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కలెక్టరేట్ వీడియో హాల్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత శాఖల అధికారులతో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం చారిత్రాత్మకమని, అధిక దిగుబడి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో షామియానాలు, తాగునీరు, విద్యుత్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధాన్యం తూకంలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 చొప్పున ధరలు అమలులో ఉన్నట్లు తెలిపారు. కొనుగోలు అనంతరం 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతులు తమ ధాన్యం తేమ శాతం 17లోపు ఉంచి కేంద్రాలకు తీసుకురావాలని అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రవాణా సమస్యలు తలెత్తకుండా అదనపు లారీలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వరి కొనుగోలు కేంద్రాలపై స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, డిఆర్డిఏ పీడీ చిన్న ఓబులేసు, సివిల్ సప్లై డీఎం రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.