14-10-2025 12:34:22 AM
తెల్లాపూర్ పౌర సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసుల ముందడుగు
రామచంద్రపురం, అక్టోబర్ 13: తెల్లాపూర్ పౌర సంఘం ఆధ్వర్యంలో గేటు ప్రహరీ కాలనీల వాసులు ఆదివారం శ్రమదానంతో రహదారిపై గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. తెల్లాపూర్ పౌర సంఘం అధ్యక్షులు ఈశ్వరరావు రమణ మాట్లాడుతూ గోపనపల్లి నుంచి కొల్లూరు వలయ రహదారి వరకు ఆర్‌ఆర్ 30 పొడిగింపు రహదారిని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు.
అయితే దశాబ్ద కాలం గడిచినా రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల కారణంగా రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో తామే రహదారి మరమ్మతులు చేయాలని నిర్ణయించుకున్నామని, అనేక కాలనీల ప్రజలు కలసి స్వయంగా పనులు చేపట్టారని తెలిపారు. కాగా రవాణా శాఖ ఉప పరిశీలకుడు నవీన్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షణ చేపట్టారు.