22-11-2025 12:00:00 AM
-బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు
-బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన, రాస్తారోకో
మానకొండూరు, నవంబరు 21,( విజయ క్రాంతి):మానకొండూరు మండల పరిధిలోని రోడ్ల దుస్థితి పై బి ఆర్‌ఎస్ పార్టీ మానకొండూరు మండలాధ్యక్షుడు తాళ్లపల్లి అధ్యక్షులు శేఖర్ గౌడ్ ఆ ధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఫ్లకార్డులతో రాస్తారోకో, ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్_ వరంగల్ ప్రధాన రహదారిపై సుమారు అరగంట బైఠాయించారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మండల పరిధిలోని బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన లో పాల్గొని కదం తొక్కారు.
ఎమ్మెల్యే రాజీనామా చేయాలి : పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణారావు
పాలనలో విఫలమైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తక్షణం రాజీనామా చేయాలని కరీంనగర్ బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని అన్ని రోడ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వాన దుస్థితిలో ఉన్నాయని పాలన అధోగతిలో ఉందని రామకృష్ణారావు విమర్శించారు. ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసం కాదు గ్రామాల అభివృద్ధి, శాసనసభ్యునికి రోడ్ల దుస్థితిపై కనువిప్పు కలగడానికి నిరసన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
అధికారంలోకి రాకముందు రోడ్ల దుస్థితిపై పాదయాత్ర నిర్వహించి కవ్వంపల్లి గత పాలకులపై చేసిన విమర్శలు మరిచిపోయారా అని నిలదీశారు. గతంలో విమర్శించి అధికారంలోకి వచ్చాక రోడ్ల దుస్థితిని విస్మరించారా అన్ని మీడియా సాక్షిగా ప్రశ్నించారు. తక్షణం రోడ్లను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఏమి సాధించారని పాలన వారోత్సవాలు నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు.
మానకొండూరు_ పచ్చునూరు రోడ్డుపై కల్వర్టు నిర్మాణం, చెంజర్ల_ కొండపలకల, మానకొండూరు పచ్చునూరు, మానకొండూరు వేగురుపల్లి తదితర రోడ్ల దుస్థితి కవ్వంపల్లి పరిశీలించాలని, తక్షణం రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గడ్డం నాగరాజు, దేవ సతీష్ రెడ్డి, శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గట్టు శ్రీధర్, పార్నంది కిషన్, అడప శ్రీనివాస్, గడ్డి గణేష్, మర్రి కొండయ్య తదితరులు నిరసనల కార్యక్రమానికిహాజరయ్యారు.