21-05-2025 12:52:45 AM
-క్రయవిక్రయదారుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు
-అక్రమాన్ని బయటపెట్టిన బీఆర్‌ఎస్ నాయకుడు
-విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హుస్నాబాద్, మే 20: పేదోళ్ల సూపర్ మార్కెట్ గా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వారసంతలో దోపిడీ జరుగుతోంది. దాని కాంట్రాక్టర్లు క్రయవిక్రయ దారుల నుంచి నిర్దేశిత ధరలను కాకుండా ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత శుక్రవారం అంగట్లో జరుగు తున్న ఈఅక్రమాన్ని బీఆర్‌ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి బహిర్గతం చేశారు.
తెలంగాణలోనే అతిపెద్దదైన హుస్నాబాద్ అంగడి నిర్వహణను గుత్తేదారులు రూ.92.20 లక్షలకే దక్కించుకున్నారు. టెండర్ విలువ తగ్గించినప్పటికీ, గత సంవత్సరం కంటే ఎక్కువ రేట్లు పెంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. టెండర్ దారులు తమ జేబులు నింపుకోవడానికే ఇలా చేస్తున్నారని, దీని వల్ల మార్కెట్ ఆదాయం తగ్గిపోతోందని మల్లికార్జున రెడ్డి అన్నారు. ఈ అక్రమ వసూళ్లను మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
టెండర్ ప్రక్రియలో సిండికేట్ ఏర్పడి మున్సిపల్కు వచ్చే ఆదాయాన్ని తగ్గించారని, టెండర్ విలువ తగ్గించడంలో, ఇప్పుడు రేట్లు పెంచడంలో మున్సిపల్ కమిషనర్ పాత్రపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై విజయక్రాంతి’ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, పలువురు చిరు వ్యాపారులతో మాట్లాడగా కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్ల దందా వాస్తవమేనని తేలింది. బాధితులు తెలిపిన వివరాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు వ్యాపారులు వాపోయారు. గత ఏడాది కంటే ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే టెండర్ దారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.
వసతులు లేక ఇక్కట్లు.. పీక్కుతింటున్న కాంట్రాక్టర్లు
ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం. తాగడానికి నీరు లేదు, కనీసం మరుగుదొడ్లు లేవు. వర్షం వస్తే బురదమయం, ఎండకొడితే బాయిలర్ లాంటి వాతావరణం. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో వ్యాపారం చేస్తున్న తమను టెండర్ దారులు పీల్చి పిప్పి చేస్తున్నారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు తెలిపారు. ‘హుస్నాబాద్ అంగట్లో జరుగుతున్నది అక్షరాలా దోపిడీ. టెండర్ దారులు ఒక ముఠాగా ఏర్పడి రైతులు, చిన్న వ్యాపారుల రక్తాన్ని పీలుస్తున్నారు.
మున్సిపల్ అధికారులు దీనిని పట్టించుకోకపోవడం వారి కుమ్మక్కుకు నిదర్శనం. టెండర్ ప్రక్రియలో అవినీతి జరిగిందని మేం బలంగా నమ్ముతున్నాం. టెండర్ విలువ తగ్గినా ధరలు పెరగడానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? మున్సిపల్ కమిషనర్ పాత్రపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం.‘ అని మల్లికార్జునరెడ్డి అన్నారు.