calender_icon.png 5 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్సీ నుంచి రోహిత్ ఔట్.. గిల్ ఇన్

05-10-2025 12:33:20 AM

  1. ఆసీస్ టూర్‌కు టీమిండియా సారథిగా గిల్
  2. వైస్ కెప్టెన్‌గా శ్రేయాస్‌కు అవకాశం
  3. భారత క్రికెట్ జట్టులో చేర్పులు.. కూర్పులు
  4. బీసీసీఐ సెలక్టర్ల కీలక నిర్ణయం 

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బీసీసీఐ సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్‌గా తప్పించారు. కొత్త సారథిగా శుభమన్‌గిల్‌కు  పగ్గాలు అప్పగించారు. ఆస్ట్రేలియా టూర్ నుంచే వన్డే కెప్టెన్‌గా గిల్ ప్రస్థానం మొదలుకానుంది. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో గెలిచిన తర్వాత ఆసీస్ పర్యటన కోసం భారత జట్టు ను ప్రకటించారు.

నిజానికి రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగిస్తారని ఇంగ్లాండ్ టూర్‌కు ముందే వార్తలు వచ్చాయి. తర్వాత హిట్ మ్యాన్‌తో సెలక్టర్లు చర్చించి గిల్‌కు వన్డే సార థ్య బాధ్యతలు అప్పగించారు. 2027 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు కెప్టెన్సీ విషయంలో ఈ మార్పు చేసినట్టు  తెలుస్తోంది.

రోహిత్ వయసు, ఫిట్‌నెస్, ఫామ్ పరిగణలోకి తీసుకునే గిల్‌కు బాధ్యతలు అప్పగించేలా కోచ్ గంభీర్ సెలక్టర్లను ఒప్పించినట్టు సమాచారం. అక్టోబర్ 19 నుం చి ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సంబంధించి జట్టు ఎంపికలో పలు మార్పులు చోటు  చేసుకున్నాయి. ఊహించినట్టుగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. శ్రేయా స్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 

గాయాల కారణంగా రిషబ్, హార్దిక్ పాండ్యా దూరం..

శ్రేయాస్ విషయంలో గత కొన్నిరోజులుగా బీసీసీఐ సెలక్టర్లు విమర్శలు ఎదుర్కొం టున్నారు. అయితే ఆ  విమర్శలకు చెక్ పెట్టే లా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గాయాల కారణంగా ఆసీస్ టూర్‌కు దూరమయ్యారు. దీంతో తెలుగుతేజం ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. తొలిసారి వన్డే జట్టులో చోటుదక్కించుకున్నాడు.

అంతేకాదు.. టీ ట్వంటీ జట్టుకూ ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే ప్రధాన వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. అతనికి బ్యాకప్‌గా ధృవ్ జురెల్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం విండీస్‌తో తొలి  టెస్టులో జురెల్ శతకంతో అదరగొట్టాడు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. జడేజా ఇప్పటికే టీ ట్వంటీల నుంచి తప్పుకోగా.. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.

అలాగే వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ దృష్ట్యా ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు సైతం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. బుమ్రా ఆసీస్ టూర్‌లో కేవలం టీ ట్వంటీ సిరీస్ మాత్రమే ఆడతాడు. ఆల్ రౌండర్ల కోటాలో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. పేస్ విభాగంలో బుమ్రా లేకపోవడంతో సిరాజ్ లీడ్ చేయబోతున్నాడు.

అతనితో పాటు హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ ఎంపికయ్యారు. బ్యాకప్ ఓపెనర్‌గా జైశ్వాల్‌కు చోటు దక్కింది. మరోవైపు టీ ట్వంటీ జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా , గిల్ ను వైస్ కెప్టెన్ గా కొనసాగించారు. ఇటీవల ఆసియాకప్‌లో ఆడిన జట్టునే దాదాపుగా ఎంపిక చేశారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మతో  పాటు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు.

వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకు సెలక్టర్లు ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. సంజూ శాంసన్ బ్యాకప్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఆసియాకప్ లో ఆడిన శివమ్ దూబే , రింకూ సింగ్ కూడా తమ  స్థానాలను నిలుపుకున్నారు.బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేసర్లుగా ఎంపికయ్యారు. ఆసీస్ పర్యటనలో భారత జట్టు ౩ వన్డేలు, ౫ టీ ట్వంటీలు ఆడుతుంది.

ఆసీస్ టూర్‌కు భారత టీ ట్వంటీ జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ (వైస్‌కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్‌రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింద్ , కుల్దీప్ యాదవ్ , హర్షిత్  రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్) రింకూ సింగ్ , వాషింగ్టన్ సుందర్

ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు

శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ  కృష్ణ, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్