calender_icon.png 13 July, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యాటిగడ్డలో రూ.46.4 లక్షల చోరీ

23-06-2025 12:00:00 AM

6 గంటల్లోనే నిందితుల అరెస్టు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీసులు ఓ భారీ చోరీ కేసును కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను పట్టుకున్నారు. ప్యాటిగడ్డలోని సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాములోని కార్యాలయ క్యాబిన్‌లో గోద్రెజ్ లాకర్‌ను పగులగొట్టి సుమారు రూ.46 లక్షలు శనివారం రాత్రి చోరీ చేశారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడు సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని పురేలికి బస్సులో పారిపోతున్నాడని తెలుసుకున్న పోలీసులు బస్ స్టాండ్‌లు, డిపోలను అప్రమత్తం చేశారు. నిందితుడి ఫొటో, వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లతో పంచుకున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు, ట్రావెల్ ఏజెన్సీలను సైతం తనిఖీ చేశారు. మెదక్‌లోని ఓ ధాబా యజమాని సెల్‌ఫోన్ నుంచి నిందితుడు కాల్ చేసినట్లు గుర్తించి, ఆ దాబాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

అనంతరం అతను ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ ద్వారా నిందితుడి కదలికలను నిశితంగా ట్రాక్ చేశారు. ఆదిలాబాద్ పోలీసుల సహాయంతో నిందితుడిని మహారాష్ర్ట సరిహద్దులో పట్టుకున్నారు. అతని నుంచి రూ.46.4 లక్షల నగదు మొత్తాన్ని రికవరీ చేశారు.

అరెస్టు అయిన నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని పురేలి, సరాయికి చెందిన గిరిధారి సింగ్ (28)గా గుర్తించారు. నిందితుడు గతంలో అదే కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. అయితే, అతని అనుచిత ప్రవర్తన కారణంగా ఆరు నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు.