calender_icon.png 29 October, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుబడితే రూ.10 వేలు

29-10-2025 12:07:01 AM

  1. డ్రంక్ అండ్ డ్రైవ్’లో జరిమానా 
  2. రెండోసారి దొరికితే జైలు

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 28 : మందుబాబులు... పారాహుషార్! ఇక నుంచి మద్యం తాగి వాహనాలు నడిపితే ఇక అంతే సంగతులు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రాణ నష్టం నివారించడానికి ట్రాఫిక్ పోలీస్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమానాలు విధిస్తోంది. మోటార్ వెహికల్ యాక్ట్ - 1988 నిబంధనల ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం నేరంగా పరిగణించబడుతుంది.

సెక్షన్ 185 ప్రకారం బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(బీఏసీ) 30 mg/100 ml కంటే ఎక్కువగా ఉంటే శిక్షార్హులు. మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే రూ.10వేలు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండు కూడా ఉండవచ్చు. అదే రెండోసారి పట్టుబడితే రూ.15వేలు జరిమానా లేదా రెండేళ్లు జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేయవచ్చు. వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.

పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచివిజయ్ కుమార్ ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సీపీ ఆదేశానుసారంసిద్దిపేట జిల్లాలో పలు చౌరస్తాల వద్ద, వివిధ సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహిస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. రోడ్డు భద్రత కోసం, ప్రమాదాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తున్నారు.

ఎవరినీ ఉపేక్షించేది లేదు:  సుమన్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ 

త్రాగి వాహనం నడిపితే ఎంతటి వ్యక్తి అయినా ఉపేక్షించేది లేదు. చట్టం ముందు అందరూ సమానమే. పట్టణంలోని వాహనదారులందరూ నిబంధనలను పాటించాలి. మద్యం తాగి వాహనం నడపకండి. నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు.