29-10-2025 12:04:44 AM
సీసీసీ చైర్మన్‌కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో అకాల వర్షాలు, తు ఫాన్ల కారణంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీవ్ర నష్టాలను నేపథ్యం లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిసి వివరించారు. పత్తి మద్దతు ధర పెంపు, తేమ శాతం సడలింపు, పత్తి సేకరణ విస్తరణ వంటి ముఖ్య అంశాలను మంత్రి ప్రస్తావించారు.
వర్షాల కార ణంగా పత్తి తేమ శాతం పెరగడంతో 8--12 శాతమున్న ప్రస్తుత నిబంధనలను 14 శాతం వరకు సడలించాలని విజ్ఞప్తి చేశారు. పత్తి రైతుల నష్టాన్ని తగ్గించడానికి ఎంఎస్‌పీ పెంపు అవసరమని, పత్తి కొనుగోలు కేంద్రాలను అన్ని జిల్లాలకు విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని నివారించాలని సీసీఐ చైర్మన్‌కు సూచించారు.
తెగులు, వర్ష నష్టాల కారణంగా రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ ఇవ్వాలని, గత సీజన్‌లో చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పరిష్కారం కోసం కృషి చేస్తామని సిసిఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. ఈ భేటీలో మంత్రితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి కూడా ఉన్నారు.