calender_icon.png 9 May, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

09-05-2025 12:10:31 AM

-కమాన్ పట్టి విరిగి హైవే కిందకు దూసుకెళ్లిన బస్సు

-డ్రైవర్ సమయస్ఫూర్తితో 100 మంది ప్రయాణికులు సురక్షితం

చేవెళ్ల, మే 8: హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 163)పై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  కమాన్ పట్టి విరగడంతో బస్సు అదుపు తప్పి హైవే కిందకు దూసుకెళ్లింది.  డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ప్రయాణికులు, బస్సు డ్రైవర్ వివరాల ప్రకారం .. కోస్గి డిపోకు చెందిన బస్సు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వయా కొడంగల్ మీదుగా కోస్గి వెళ్తోంది.  చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే..  బస్సు ముందు భాగంలో కుడివైపు టైర్ వద్ద ఉండే కమాన్ పట్టి  విరిగిపోయింది. 

దీంతో బస్సు అదుపు తప్పి హైవే ఎడమవైపు కిందకు దూసుకెళ్లింది.  డ్రైవ ర్ అప్రమత్తమై సడెన్ బ్రేకులు వేసి బస్సును నిలిపివేశాడు.  ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో  దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే బస్సు బోల్తా పడేదని  డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్ హెచ్ 163 విస్తరణలో జాప్యం కారణంగా రోడ్డు గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైకా స్పందించి రోడ్డు పనులు స్పీడప్ చేయాలని స్థానికులు కోరారు.