calender_icon.png 6 August, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీటిలో ఆర్‌యూబీలు!?

06-08-2025 12:44:53 AM

  1. వర్షాకాలం రాకపోకలు బంద్ 

రైలు ట్రాక్ దాటేందుకు తిప్పలు 

మహబూబాబాద్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): రైలు పట్టాలు దాటేందుకు కాజీపేట - విజయవాడ రైల్వే సెక్షన్ లోని మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు వర్షాకాలంలో వరద నీటితో నిండి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీనివల్ల వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా ప్రాంతాల ప్రజలు రైల్వే ట్రాక్ దాటేందుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాజీపేట - విజయవాడ రైల్వే సెక్షన్ లో అనేకచోట్ల నిర్మించిన అండర్ బ్రిడ్జిల పరిస్థితి ఇదే రకంగా ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే ట్రాక్ దాటకుండా రైల్వే ట్రాక్ దిగువ భాగం నుండి పశువులు, ఎడ్ల బండ్లు, తేలికపాటి వాహనాలు, పాదాచారులు రైల్వే ట్రాక్ దాటేందుకు ఆర్యుబీలను నిర్మించారు. అయితే చాలా చోట్ల భూమికి దిగువన ఆర్యుబీలను నిర్మించడం వల్ల వర్షాకాలం వస్తే చాలు అందులో వరద నీరు అక్కడే తిష్ట వేస్తుంది.

దీనితో ఆర్యూబీలు నీటి కొలనుగా మారుతున్నాయి. ఆర్యుబీలు నిర్మించిన తర్వాత రైల్వే గేట్లను మూసివేశారు. ఫలితంగా ఆర్యుబీలో వరద నీరు చేరడం, ఇటు రైల్వే గేట్లు మూసివేయడంతో వర్షాకాలంలో పాదాచారులు, పశువులు, వాహనాలు  రైల్వే ట్రాక్ దాటే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిచోట్ల వర్షం నీటిని బయటకు తోడి పోయడానికి రైల్వే శాఖ విద్యుత్ మోటర్లు అమర్చింది.

అయితే పలుచోట్ల ఏర్పాటు చేసిన మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో, నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. రంగాపురం 79వ రైల్వే గేట్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన మోటర్ ను దొంగలు అపహరించారు. దీంతో వర్షం నీరు ఆర్యుబీలో నిలవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక ఇదే విధంగా కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్లో మధ్య 76 రైల్వే ఎల్ సీ వద్ద నిర్మించిన ఆర్యుబీలో వరద నీరు నిండడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.

అక్కడ ఏర్పాటు చేసిన మోటర్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు రైల్వే ట్రాక్ లు  ఉండగా అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా పశువులను రైల్వే ట్రాక్ దాటించే వారమని, ఇప్పుడు మూడో లైన్ వేయడం వల్ల రైళ్లు క్షణకాలంలో వస్తున్నాయని, రైలు పట్టాలు దాటే పరిస్థితి లేకుండా పోయిందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు.

ఇటు పట్టాలపై నుండి దాటడం కష్టంగా మారిందని, అటు ఆర్యుబీ నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేదని, అనేకమందికి ట్రాక్ ఇరువైపులా వ్యవసాయ భూములు ఉన్నాయని, తమ పనులకు వెళ్లడానికి ఆటంకంగా రైల్వే ట్రాక్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహబూబాబాద్ పట్టణంలో నిర్మించిన ఆర్యుబీలో కూడా వర్షకాలంలో నీరు  నిలుస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

ఇక కేసముద్రంలో ఆర్యుబీ నిర్మించకుండా వదిలేయడంతో అండర్ డ్రైనేజీ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆర్యుబీ లు వర్షాకాలంలో వినియోగించే పరిస్థితి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి వర్షాకాలంలో ఆర్యుబీల్లో వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకొని, రైల్వే ట్రాక్ దాటేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

వరద కాలువ కాదు..ఆర్యుబీ ఇది..!

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తే వరద కాలువ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది ఇంటికన్నె కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య ఏర్పాటు చేసిన ఆర్యుబీ దృశ్యం. వర్షాకాలంలో ఆర్యుబీ పూర్తిగా వరద నీరు నిండి ఉండడం నిత్య కృత్యం.

అయితే ఆర్యుబీ లో వరద నీటిని బయటకు తోడడానికి రెండు మోటార్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా పనిచేయడం లేదు. దీనితో వర్షాకాలంలో ఆర్యుబీ వినియోగానికి అనువుగా లేకుండా పోయింది. ట్రాక్ కు ఇరువైపులా ఉన్న భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లి రావడానికి కష్టంగా మారింది.