18-07-2025 12:00:00 AM
పీహెచ్సీ, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
మునిపల్లి, జూలై17 : మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చిన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్, జ్వరం సర్వేను పరిశీలించి మెడికల్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు .
అనంతరం మునిపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూభారతి ప్రోగ్రెస్ ,కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రెస్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ చేసి, ద్రువీకరణ పూర్తి చేసి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలలో మొక్కలు నాటి నీరు పోసి హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలని నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ గంగాభవాని, ఎంపీడీఓ హరినందన్ రావు, డాక్టర్ సంధ్యారాణి, ఎంపీఓ అండాలమ్మ, డిప్యూటీ ఎమ్మార్వో ప్రదీప్, మునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి యాదయ్య, నాయకులు రమేష్ గౌడ్, నరేష్ తదితరులుఉన్నారు.